ఐటీ కొలువు వదిలి వ్యవసాయం.. పిడుగుపడి టెకీ దుర్మరణం..

Wait 5 sec.

కర్ణాటకలోని మైసూరులో విషాదం చోటుచేసుకుంది. ఎన్నో కలలు, ఆశయాలతో ఐటీ కొలువు వదిలి.. వ్యవసాయం బాటపట్టిన ఓ టెకీ, అనుకోకుండా ప్రాణాలు కోల్పోయారు. మడికేరి టౌన్ ‌ప్రాంతానికి చెందిన రోషన్ బాలకృష్ణకు 43 ఏళ్లు. ఇన్నేళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన ఆయన మనసు.. సేద్యం వైపు మళ్లింది. దీంతో ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టారు. ఒక స్నేహితుడితో కలిసి వ్యవసాయ రంగంలో పనిచేయడం ప్రారంభించారు. ఇంటి నుంచే వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేవారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను పరిచయం చేయడం, వాటిని మార్కెటింగ్ చేయడం వంటి పనులు ప్రారంభించారు.ఇక తన వ్యవసాయ కార్యకలాపాలను విస్తరించుకునే ప్రయత్నాలలో భాగంగా రోషన్ బాలకృష్ణ స్థలం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం భూమిని పరిశీలించేందుకు మైసూరుకు వెళ్లారు. వ్యవసాయ భూమిని చూసేందుకు తన భార్య, కుమారుణ్ని కూడా వెంట తీసుకెళ్లారు. ఆ వ్యవసాయ భూమి సమీపంలో ఒక మామిడి చెట్టు ఉంది. ఈ చెట్టు నుంచి మామిడి పండ్లు కోయడానికి రోషన్ ఆగిన సమయంలో, అకస్మాత్తుగా అతనిపై పిడుగు పడినట్లు తెలిసింది. దీంతో రోషన్ బాలకృష్ణ కుప్పకూలి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే అక్కడ ఉన్న మరో వ్యక్తికి కూడా పిడుగుపాటుకు గాయాలయ్యాయి. పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన రోషన్ బాలకృష్ణ కుటుంబానికి మైసూరు జిల్లా విపత్తు నిర్వహణ విభాగం పరిహారం ప్రకటించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి నాలుగు లక్షలు, జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ.లక్ష కలిపి.. మొత్తంగా రూ.5 లక్షలు పరిహారం ప్రకటించింది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఎన్నో ఆశయాలతో వ్యవసాయం వైపు అడుగులు వేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోవటం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇదే సమయంలో వర్షాకాలలో వ్యవసాయ క్షేత్రాలలో పిడుగుపాటు ఎంత ప్రమాదకరంగా మారుతుందో.. ఈ ఘటన ద్వారా మరోసారి తెలిసివచ్చింది. ఈ నేపథ్యంలో వర్షం కురుస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దని హెచ్చరిస్తున్నారు.