నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 46.3 డిగ్రీలతో ఠారెత్తించిన ఎండలు, వడదెబ్బకు 9 మంది బలి

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. వేసవి తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రాష్ట్రంలోని దాదాపు పది జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటి దూసుకుపోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. శుక్రవారం నమోదైన గణాంకాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో అత్యధికంగా 46.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ ప్లానింగ్ సొసైటీ అందించిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతాల్లో 46.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 45.6 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 45.4 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మునగాలలో 45.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, ములుగు జిల్లా వెంకటాపూర్, వరంగల్ జిల్లా సంగెం ప్రాంతాలలో సైతం రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ భారీ ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు తోడవడంతో రోడ్లన్నీ మధ్యాహ్నం వేళ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లోని సుమారు 46 మండలాల్లో వడగాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని 9 మండలాల్లో వడగాలులు వీయగా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8 మండలాలు, పెద్దపల్లిలో 7, నిర్మల్‌లో 6, జగిత్యాలలో 5 మండలాల్లో తీవ్రమైన వేడి గాలులు జనాన్ని అల్లాడించాయి. వీటితో పాటు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో చెరో 3 మండలాల్లో, ములుగు జిల్లాలోని 2 మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం కూడా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసింది.మరోవైపు, ఈ తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉష్ణోగ్రతల తట్టుకోలేక, వడదెబ్బ తగిలి శుక్రవారం ఒక్కరోజే వివిధ జిల్లాల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రజలకు ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ ఒక సానుకూల వార్తను కూడా అందించింది. రాబోయే ఒకటి రెండు రోజుల పాటు తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఉంటాయని హెచ్చరించినప్పటికీ ఆదివారం నుంచి వాతావరణంలో మార్పులు వస్తాయని పేర్కొంది. ఆదివారం ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనివల్ల వచ్చే నెల ఒకటో తేదీ తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పడతాయని అప్పటివరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.