బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అక్కడ ఎండలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో ఓవైపు ఎండల తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇవాళ పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్నారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రజలకు బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకెళ్లాలని సూచిస్తు్న్నారు. అత్యవసరంగా బయటకు వెళ్తే చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. ఈ ప్రభావంతో ఇవాళ అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు. శుక్రవారం కూడా రాష్ట్రంలో వర్షాలు కొనసాగాయి.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు. అయితే పలు జిల్లాల్లో వర్షాలు కూడా పడ్డాయి.