ఏపీ మాజీ మంత్రి కన్నుమూత.. వైఎస్ కేబినెట్‌లో రెండుసార్లు మంత్రి.. ఆ తర్వాత టీడీపీ, మళ్లీ వైసీపీ!

Wait 5 sec.

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వెంకటరెడ్డి తుదిశ్వాస విడిచారు. గాదె మరణంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. వెంకటరెడ్డి కొన్ని సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. గాదె మృతదేహాన్ని ఇవాళ స్వగ్రామం పావులూరుకు తరలించనున్నారు.. ఆదివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.వెంకటరెడ్డి 1940 జులై 10వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జన్మించారు. ఆయన న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు.. కొంతకాలం లాయర్‌గా పనిచేశారు.. అయితే కాసు బ్రహ్మానందరెడ్డి పిలుపుతో కాంగ్రెస్‌లో చేరారు. 1967లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఆయన 27 ఏళ్ల వయస్సులో అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో 1983, 1985,1989లో పోటీ చేసినా వరుసగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. గాదె 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు.. 1994లో మరోసారి పర్చూరు నుంచి పోటీచేసి విజయం సాధించారు. వెంకటరెడ్డికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్లలో మంత్రి పదవి దక్కింది. గాదె వెంకటరెడ్డి మారిన స్థానిక రాజకీయ పరిణామాలతో పర్చూరు నియోజకవర్గం నుంచి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మారిపోయారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీచేసి గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. గాదె వెంకటరెడ్డి 2014లో రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికారు.. 2016లో టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో బాపట్ల నుంచి తన కుమారుడికి టికెట్ ఆశించినా రాలేదు. ఆ తర్వాత 2020లో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ తర్వాత నుంచి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు.. ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు మధుసూదన్ రెడ్డి ఉన్నారు.