ఐపీఎల్ కమ్ బ్యాక్ స్టార్ .. ఈ సీజన్‌లో వికెట్ల మోత మోగిస్తున్నాడు. బ్యాటర్ల హవా కొనసాగుతున్న ఐపీఎల్ 2026లో పవర్ ప్లేలో ఓపెనర్లను పెవిలియన్‌కు పంపుతూ తన సత్తా ఏంటో చూయించాడు. పదేళ్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్‌ను 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అక్కడ నుంచి తన దశ తిరిగిందంటూ నేరుగా భువీనే కామెంట్స్ చేయడం విశేషం. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ 28 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 26 వికెట్లు పడగొట్టి, కగిసో రబడాతో సమానంగా వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం పర్పుల్ క్యాప్ అందుకున్న భువనేశ్వర్.. తన కమ్ బ్యాక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్నేళ్ల ముందు వరకూ తనకు ఇంత కాన్ఫిడెన్స్ లేదని, జట్టులో తన స్థానం కూడా ఊగిసలాడుతూ ఉండేదని భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. కానీ ఆర్సీబీలోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయిందని.. తనలోని ప్రతిభ మళ్లీ బయటకు వచ్చిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "కొన్నేళ్ల కిందట నాలో ఇంత ఆత్మ విశ్వాసం లేదు. ఎందుకంటే జట్టులో నా స్థానం ప్రమాదంలో ఉన్నట్లు నాకు అనిపించేది. కానీ ఆర్సీబీ‌లోకి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఇక్కడి వాతావరణం నా సామర్థ్యంపై నాకు నమ్మకం తిరిగి వచ్చేలా చేసింది. మన చుట్టూ మంచి వాతావరణం ఉంటే మనలోని ప్రతిభ బయటకు వస్తుంది" అంటూ భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ అందుకునే సమయంలో వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున భువనేశ్వర్ కుమార్ 2014 నుంచి 2024 వరకూ ఆడాడు. ఈ పదేళ్ల కాలంలో భువీ 157 వికెట్లు పడగొట్టడమే కాకుండా 2016లో 23, 2017లో 26 వికెట్లు తీసుకుని వరుసగా రెండేళ్ల పాటు పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. సన్‌రైజర్స్ అతడికి వైస్ కెప్టెన్‌గా కూడా అవకాశం ఇచ్చింది. ఆర్సీబీలోకి వచ్చిన తర్వాత భువనేశ్వర్ కుమార్ గతేడాది 17 వికెట్లు పడగొట్టగా, ఈ ఏడాది 26 వికెట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.