హైదరాబాద్‌కు చెందిన టెక్ ప్రొఫెషనల్ అరుణ్ కుమార్ తివారీ (53) ఐదు రోజుల క్రితం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. 8848.86 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆయన.. కిందకు దిగుతుండగా శిఖరాగ్రం నుంచి 60 మీటర్లు కిందకు రాగానే.. హిల్లరీ స్టెప్ వద్ద ఆయన రక్తపు వాంతులు చేసుకున్నారు. హిల్టరీ స్టెప్ అనేది ఎవరెస్ట్ పర్వతంపై 8 వేల మీటర్ల ఎత్తున ఉన్న డెత్ జోన్. ఇంత ఎత్తులో గాలి చాలా పలుచగా ఉండటం వల్ల శరీరం వేగంగా క్షీణిస్తుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి సహకరించే షెర్పాలు ఆక్సిజన్ సాయంతో ఆయన్ను బతికించడానికి ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు.పయనీర్ అడ్వెంచర్ సంస్థ తరఫున భారత యాత్ర బృందంతో కలిసి అరుణ్ కుమార్ తివారీ కూడా వెళ్లారు. అరుణ్ కుమార్ డెడ్ బాడీని 8 వేల మీటర్ల కంటే ఎత్తు నుంచి తీసుకొని రావడానికి రూ.1.1 కోట్లు ఖర్చవుతుందని ఈ సంస్థ మొదట కోట్ చేసింది. అయితే మానవతా దృక్పథంతో దాన్ని రూ.89.7 లక్షలకు తగ్గించింది. అయితే ఇది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి అయ్యే ఖర్చు కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ.55 రోజుల ఖాట్మండు-ఎవరెస్ట్-ఖాట్మండు ప్యాకేజీకి అన్ని ఖర్చులతో కలిపి తాము 45 వేల డాలర్లు (రూ.42.9 లక్షలు) వసూలు చేస్తామని పయనీర్ అడ్వెంచర్ అధినేత నివేష్ కార్కి తెలిపారు. డెత్ జోన్ నుంచి డెడ్ బాడీని బయటకు తీయడం అనేది చాలా ప్రమాదకరమైన ఆపరేషన్ అని ఆయన చెప్పారు.ఈసారి కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో తివారీ అలసటకు గురయ్యారు. క్యాంప్ 4 నుంచి చివరి దశ పర్వతారోహణ ప్రారంభించిన వెంటనే ఆయన తీవ్ర అలసటకు గురయ్యారని.. దీంతో వ్యక్తిగత షెర్పా ఆయన్ను కిందకు దిగిపోవాలనే పదే పదే సూచించారు. కానీ తివారీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ‘ఎవరెస్ట్ శిఖరం కళ్ల ముందు కనిపిస్తోంది. చేతికి అందే దూరంలో ఉన్నప్పుడు.. నా కలను వదులుకునే ప్రసక్తే లేదని తివారీ షెర్పాతో చెప్పారు’ అని కార్కి తెలిపారు.డెత్ జోన్‌లో మరణించడంతో అరుణ్ కుమార్ మృతదేహాన్ని తీసుకొని రావడం చాలా కష్టంగా మారింది. ఇక్కడి నుంచి మనుషులు డెడ్ బాడీని కిందకు తీసుకురావడం దాదాపుగా అసాధ్యం. ఇక మిగిలిన ఆప్షన్ హెలికాప్టర్ ద్వారా కిందకు తీసుకురావడం. కానీ 6400 మీటర్ల ఎత్తులో ఉన్న క్యాంప్-2 నుంచి మాత్రమే హెలికాప్టర్‌లో తీసుకురావడం వీలవుతుంది. అంటే షెర్పాలు తివారీ మృతదేహాన్ని పర్వతపు అంచు నుంచి అత్యంత ప్రమాదకర ప్రాంతాల మీదుగా 2400 మీటర్లు నిటారుగా కిందకు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం దట్టమైన మంచుతో నిండి ఉంటుంది. కాబట్టి అక్కడికి షెర్పాలను పంపించడం వల్ల వారి ప్రాణాలు కూడా రిస్క్‌లో పడతాయి.‘‘డెత్ జోన్ నుంచి డెడ్ బాడీలను తీసుకొని రావడానికి 8 నుంచి 10 మంది షెర్పాలు అవసరం. గడ్డ కట్టిన మృతదేహాలను మంచు నుంచి కత్తిరించి బయటకు తీసి, వాటిని తాళ్లతో భద్రపర్చి, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రమాదకర ప్రాంతాల మీదుగా క్యాంప్-2 వరకు మోసుకొని రావడానికి రోజుల తరబడి సమయం పడుతుంది. ఈ ఆపరేషన్ నిర్వహించడానికి భారీ మొత్తంలో బాటిళ్లలో నింపిన ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఈ క్రమంలో రెస్క్యువర్లు మంచు వల్ల అనారోగ్యం బారిన పడటం, మంచు తుఫాన్లు, అలసటకు గురి కావడం, పైనుంచి పడిపోవడం లాంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో ఎవరైనా చనిపోతే మృతదేహాలను తీసుకొని రావడానికి బీమా చేయిస్తారు. అయితే ఇది హెలికాప్టర్ ద్వారా తరలించడానికి మాత్రమే కవర్ అవుతుంది. మనుషుల సాయంతో డెడ్ బాడీని వెలికి తీయడానికి ఇన్సూరెన్స్ కవర్ కాదు’’ అని కార్కీ తెలిపారు.‘‘తివారీతోపాటు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ యాత్రా బృందంలోని సభ్యుడైన 46 ఏళ్ల సందీప్ ఆరే కూడా కిందకు దిగుతున్న సమయంలో చనిపోయారు. అయితే కొంచెం తక్కువ ఎత్తులో మరణించడం వల్ల ఆయన మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యమైంది. సందీప్ క్యాంప్-3 సమీపంలో మరణించారు. కిందకు దిగుతున్న షెర్పాలు ఆయన డెడ్ బాడీని కష్టపడి క్యాంప్ 2 వరకు తీసుకొచ్చారు. దీంతో అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా తరలించడం సాధ్యమైంది’’ అని కార్కీ చెప్పారు.తివారీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతడి డెడ్ బాడీని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకోవడానికి డబ్బు ఖర్చు చేయాల్సి రావడమే కారణం కాదని కుటుంబ సభ్యులు తెలిపారు. మతపరమైన విశ్వాసాలు, హిమాలయాలపై తివారీకి ఉన్న ప్రేమ, ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉండటం.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే మృతదేహాన్ని కిందకు తీసుకు రాకూడదని నిర్ణయించినట్లు తివారీ బావమరిది సుధీర్ ఉపాధ్యాయ్ తెలిపారు.‘మన మత గ్రంథాల ప్రకారం హిమాలయాలు శివుడి అర్థాంగి అయిన పార్వతీదేవికి తండ్రి. ఇది దేవభూమి. అక్కడ చనిపోయిన వారు వైకుంఠధామానికి వెళ్తారు. అలాంటి మళ్లీ ఆయన్ను అక్కడి నుంచి భూమి మీదకు తీసుకురావడం పాపం అని సుధీర్ వ్యాఖ్యానించారు. హిందూ నమ్మకాలు, ఈ పర్వత శ్రేణులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం దృష్ట్యా.. హిమాలయాలలో తివారీ మరణించడాన్ని తమ కుటుంబం ఒక రకమైన ‘సమాధి’గా భావిస్తోందని సుధీర్ తెలిపారు. అంత ఎత్తులో మా బావ ఎముకలు పెళుసుగా మారతాయి. శరీరం దెబ్బతిని ఉంటుంది. తమ తండ్రిని పిల్లలు చివరిసారిగా ఇలాంటి స్థితిలో చూడకూడదు. మా బావకు ఇంతకంటే మెరుగైన అంతిమ విశ్రాంతి స్థలం మరొకటి ఉండదు అని సుధీర్ భావోద్వేగంగా మాట్లాడారు.ఎవరెస్ట్ శిఖర అధిరోహణ సమయంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు డాక్యుమెంటేషన్ పరంగా సమస్యలు ఎదురవుతాయని కార్కీ తెలిపారు. డెడ్ బాడీని రికవరీ చేయడం, ఖాట్మండులో అధికారికంగా గుర్తించడం జరగనంత వరకు పర్వతారోహకుడు అదృశ్యమైనట్లుగానే భావిస్తారు. బాడీని కిందకు తీసుకురాకపోతే డెత్ సర్టిఫికెట్ పొందడం కష్టం అవుతుంది. అధికారులకు మృతదేహం గుర్తింపు, పోస్టుమార్టం రిపోర్టు అవసరం అవుతాయని కార్కీ తెలిపారు. ఇప్పటి వరకూ 344 మందికిపైగా పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరంపై మరణించారు. అయితే తివారీ లాంటి కారణాల వల్లే 200 డెడ్ బాడీలను పర్వతంపైనే వదిలేశారు.