స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీలో రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండటంతో.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొని.. ప్రతిచోటా జెండా ఎగరేయాలని వైసీపీ అధినేత మోహన్ రెడ్డి పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలు, సమన్వయకర్తలు, ఇంఛార్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎలా నడుచుకోవాలనే దానిపై నేతలకు జగన్ పలు సూచనలు చేశారు. ఈ క్రమంలోనే పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు వైసీపీ అధినేత. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా పోటీ చేయాలని.. పోటీ చేసే అభ్యర్థికి ఇంఛార్జిలు సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే అది.. ఆ నియోజకవర్గ ఇంఛార్జి వైఫల్యంగా భావిస్తానంటూ జగన్ హెచ్చరించారు. "ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరేయాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం నేను చాలా సీరియస్‌గా తీసుకుంటా. ఇది మళ్లీ మళ్లీ చెప్తున్నా. అలా జరిగితే అది నియోజకవర్గ ఇంఛార్జి ఫెయిల్యూర్‌గానే భావిస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్సీలు మనకు అండగా నిలిచే గ్రామాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఆ గ్రామంలోని ఎస్సీల నుంచి క్యాండిడేట్ రావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి. వారికి మీరు సహకారం అందించాలి. నాకు వైసీపీ తోడుగా ఉంది, ఇంఛార్జి అండగా ఉన్నారనే ధైర్యం కల్పిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలుస్తారు." అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు ఎవరనే దానిపై ఇప్పటికే ఇంఛార్జులకు స్పష్టమైన అవగాహన ఉంటుందన్న జగన్.. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వారిలో నుంచి ఎంపిక చేసి పోటీకి సన్నద్ధం చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికలు వచ్చేనాటికి.. చంద్రబాబు ప్రభుత్వం పాలనా వైఫల్యాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను.. వైసీపీ గ్రామ, వార్డు స్థాయి యంత్రాంగం ద్వారా, ప్రతి ఇంటికీ చేరవేయాలని.. వాటిపై అవగాహన కల్పించాలన్నారు. వెన్నుపోటు రెండేళ్లు పేరుతో చంద్రబాబు వైఫల్యాలపై రూపొందించిన ఈ బుక్‌లెట్‌ కాపీలు ప్రతీ ఇంటికీ చేరేలా చూడాలని నేతలకు జగన్ స్పష్టం చేశారపు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చేస్తే.. ప్రజలే తిరగబడతారని వైఎస్ జగన్ సూచించారు.