‘ఖర్చులు పెరిగి జనం అల్లాడిపోతున్నారు.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించండి’.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

Wait 5 sec.

ఇరాన్ యుద్ధం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రవాణా నిలిచిపోవడంతో.. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రజలపై భారం మోపొద్దనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇంత కాలం ధరలు పెంచకుండా ఓపికతో వ్యవహరించింది. . కానీ నానాటికీ ఆర్థిక భారం పెరుగుతూ పోతుండటంతో.. గత పది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం మొదలుపెట్టింది. దీంతో పది రోజుల్లోనే నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీని ప్రభావం సామాన్యులపై తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తక్షణమే కనీసం 10 శాతం తగ్గించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కీలక నేత బహిరంగ లేఖ రాశారు.కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థికంగా నలిగిపోతోందన్న హరీశ్ రావు.. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఇంటి ఖర్చులు పెరగడం లాంటి కారణాలతో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. పొదుపు తగ్గడంతోపాటు ప్రజల కొనుగోలు సామర్థ్యం కూడా తగ్గిందన్నారు. ఇంటిని నడపటం పేదలు, మధ్యతరగతికి శక్తికి మించిన భారంగా మారిందన్నారు.ద్రవ్యోల్బణం పెరగడానికి, ధరలు పెరగడానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే అతిపెద్ద కారణమన్న హరీశ్ రావు.. ఇంధన ధరల పెంపు వల్ల ప్రతి రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. రవాణా, వ్యవసాయం, ఆహార ధరలు, నిత్యావసరాలు, స్కూల్ ఫీజులు, బస్సు ఛార్జీలు, రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. ఇంధనం ధరలు పెంపు ప్రభావం నేరుగా సామాన్య కుటుంబాల బడ్జెట్‌పై పడుతోందన్నారు. పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న పన్నుల మధ్య సామాన్యుడు నలిగిపోతున్నాడని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వల్ల లాభపడుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. . ఫలితంగా పెట్రోల్ ధరలు హైదరాబాద్ లీటర్‌కు రూ.115 దాటితే, డీజిల్ ధర లీటర్‌కు రూ.103 దాటిందన్నారు.పెట్రోల్ ధరల పెంపు వల్ల తెలంగాణ ప్రభుత్వానికి వ్యా్ట్ రూపంలో అదనంగా భారీ ఆదాయం సమకూరుతోందని హరీశ్ రావు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ప్రతిసారి ఆటోమెటిగ్గా తెలంగాణ వ్యాట్ కలెక్షన్లు పెరుగుతున్నాయన్నారు.తెలంగాణలో సగటున నెలకు 27 కోట్ల లీటర్ల పెట్రోల్, 45 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారన్న హరీశ్ రావు.. పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం చొప్పున వ్యాట్ వసూలు చేస్తు్న్నారన్నారు. లీటర్‌కు రూ.7.50 చొప్పున ఇంధనం ధరలు పెంచడం వల్ల లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ.2.64, డీజిల్‌పై రూ.2.025 చొప్పున వ్యాట్ పెరుగుతోందని.. దీని వల్ల తెలంగాణ ప్రభుత్వానికి నెలకు రూ.162.41 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతోందన్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.1948.92 కోట్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. వ్యాట్ తగ్గించడం వల్ల ఇంధనం ధరలు తగ్గి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేవారని.. పేదలు, మధ్యతరగతికి తాను ఛాంపియన్‌ అని రేవంత్ రెడ్డి ప్రొజెక్టు చేసుకున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు కనీసం 0.1 శాతం వ్యాట్ కూడా తగ్గించలేదని హరీశ్ రావు మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడిన కాంగ్రెస్.. ఇప్పుడు జనం బాధల నుంచి లాభాలు పొందుతుందని ఆరోపించారు. ప్రజాపాలనను విశ్వసించే ప్రభుత్వాలు సామాన్యుడి ఖాళీ జేబులను కొల్లగొట్టి ఖజానా నింపుకోవన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను ఆదాయ వనరుగా చూడకుండా.. ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.