ఆంధ్రప్రదేశ్ ఉప-ముఖ్యమంత్రి, జనసేన అధినేత పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో కుల రాజకీయాలు, ప్రత్యర్థుల విమర్శలు, పార్టీ అంతర్గత పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, పక్క రాష్ట్రంలో రాజకీయాలతో పోల్చుతున్నారని మండిపడ్డారు. తమిళ రాజకీయాలు చాలా సాఫీగా సాగిపోతాయని, అక్కడి రాజకీయాలను చూస్తే అసూయ కలిగేంత సులువుగా జరిగాయని, కటౌట్ పెట్టుకుని విజయ్ ఈజీగా సీఎం అయ్యాడు అన్నారు. తాను ఈస్థాయికి ఎదిగేందుకు 12 ఏళ్లు పట్టిందన్నారు. అలాగే, పదేపదే తాను కులం గురించి మాట్లాడుతున్నానని విమర్శిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ‘‘నేను కుల నాయకుడినని ఎప్పుడైనా చెప్పానా? మిగతా పార్టీ నాయకులు కులం గురించి మాట్లాడటం లేదా?’ అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కులం పేరుతో రెచ్చగొట్టే మనస్తత్వం సమాజానికి మంచిది కాదని హితవు పలికారు.ఇదే సమయంలో తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు తాను వైసీపీ నేతలను అరెస్ట్ చేయించాలని కోరినట్టు జరుగుతోన్న ప్రచారంపై పవన్ ఘాటుగా స్పందించారు. ‘‘నేను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించిన విషయాలు బయటకు ఎలా తెలుస్తాయి? ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఎందుకు దీనిపై స్పందించలేదు? వైసీపీ నేతలు జైలుకెళ్లాలని ఎందుకు కోరుకుంటాను? ఒక నేత జైలుకెళ్తే జనసేన పార్టీ ఎదుగుతుందా?’’ అంటూ పవన్ నిలదీశారు. కేంద్ర మంత్రితో రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడుతామని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం వ్యవస్థను అవమానించడమేనని పవన్ మండిపడ్డారు. అమిత్ షాను కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే కలిశానని పవన్ స్పష్టం చేశారు. ఈ సమయంలో తనపై చేస్తున్న విమర్శలకు పవన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తాను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, బలమైన శత్రువులనే ఎదుర్కొంటానని, బలహీనులను కాదని ఉద్ఘాటించారు. ‘‘నేనూ మనిషినే.. నాకు కోపాలు, బాధలు, భావోద్వేగాలు ఉంటాయి. చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు.. దేనికైనా ఓ హద్దు ఉంటుంది.. భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాట తీస్తాం’’ అంటూ పవన్ హెచ్చరించారు.