'పద్మ అవార్డులు 2026' ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం (మే 25) న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గల గణతంత్ర మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలకు దేశ అత్యున్నత పౌర పురష్కారాలు ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.దివంగత లెజండరీ నటుడు ధర్మేంద్రకు భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషణ్‌' ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆయన భార్య, నటి హేమా మాలిని, ఆయన తరపున ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆరు దశాబ్దాల పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకు, కళల రంగంలో ధర్మేంద్రకు మరణానంతరం ఈ అవార్డును ప్రకటించారు. ధర్మేంద్రకు 2012లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. 90 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో నటించిన దిగ్గజ నటుడు.. 2025 నవంబర్ 24న కన్నుమూశారు.మలయాళ నటుడు మమ్ముట్టి , ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, పీయూష్ పాండే (మరణానంతరం)లకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. మమ్ముట్టి, అల్కా ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. పీయూష్ పాండే తరపున ఆయన భార్య నీతా పాండే అవార్డును స్వీకరించారు. నటులు ఆర్. మాధవన్, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, సతీష్ షా, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లకు కూడా పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు. మాధవన్, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాణిజ్యం-పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం- విద్య, క్రీడలు, సివిల్‌ సర్వీస్‌ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అవార్డులు ప్రకటించారు. ఈ ఏడాది 5 మందికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వనున్నారు. వారిలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. తొలి దఫాలో 66 మందికి అవార్డులు బహూకరించారు.