మహిళలకు బంపర్ న్యూస్.. కీలక హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Wait 5 sec.

రాష్ట్రంలోని 8 వేల స్వయం సహాయక బృందాల గ్రామ సంఘం భవనాలకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య సొంత చెల్లెళ్లను అన్నలు ఇంట్లో నుంచి వెళ్లగొడుతున్నారని.. ఆస్తిలో వాటా అడుగుతారనే కారణంతో సొంత చెల్లిని కూడా ఇంట్లో నుంచే పంపిస్తున్న సందర్భంలో.. కోటి మంది ఆడబిడ్డలను ఈ మంత్రివర్గం సొంత సోదరీ మణుల్లా భావించి.. వారికి చీర పెట్టే కార్యక్రమాన్ని.. వారిని ఆర్థికంగా నిలబెట్టే ప్రణాళికను రూపొందించిందన్నారు. కోటి మంది ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. 2034లోగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందన్నారు.మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. 29 నెలల్లో పది వేల కోట్ల రూపాయలకుపైగా మహిళలకు ఉచిత బస్సు కోసం ఆర్టీసీకి చెల్లించామన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని గిట్టని వాళ్లు ప్రయత్నించారన్న రేవంత్ రెడ్డి.. ఆటో కార్మికులు, రిక్షా కార్మికులను రెచ్చగొట్టారన్నారు. అయినా సరే ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నారు. చాలా మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారనే భావన కలుగుతున్న సమయంలో.. మహిళలను బస్సులకు యజమానులు చేయాలనే ఉద్దేశంతో వెయ్యి బస్సులను మహిళా సంఘాలు కొనుగోలు చేసి.. ఆర్టీసీకి ప్రతి నెలా రూ.70 వేల చొప్పున అద్దెకు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అందులో భాగంగా 553 బస్సులను ఇవాళ అంకితం చేయబోతున్నామన్నారు. మండలానికి ఒక బస్సు చొప్పున.. పరేడ్ గ్రౌండ్‌లో అందరూ ఒకచోట చేరి జూన్ ఐదో తేదీ సాయంత్రం బస్సుల ప్రారంభోత్సవం జరపాలని మంత్రివర్గం ఆలోచన చేస్తోందన్నారు.వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును మహిళలకు ఇవ్వాలని భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రాల్లో మహిళలతో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయించామన్నారు. వీటి ద్వారా మహిళలు నెలకు రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో వీలైనంత వరకు పెట్రోల్ బంకులకు స్థలాలు కేటాయించి.. ఆడబిడ్డలతో పెట్రోల్ బంకుల వ్యాపారం చేయించాలని నిర్ణయించామన్నారు.ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న బ్యాంకు లింకేజ్‌లను రూ.10 లక్షలకు పెంచుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.60,472 కోట్లను మహిళలకు బ్యాంక్ లింకేజీలు ఇచ్చిందన్నారు. నిర్మల్ జిల్లా మహిళా సంఘాలు అప్పులు చెల్లింపులో తొలి స్థానంలో ఉన్నాయని సీఎం కొనియాడారు.8500 ఐకేపీ కేంద్రాల్లో మహిళలు ధాన్యం కొనుగోలు చేస్తే.. రవాణా, మిల్లర్లతో సమస్యలు వస్తున్నాయన్నారు. భవిష్యత్తులో మహిళలే స్వయంగా రైస్ మిల్లులు కట్టుకునేలా రుణాలు ఇప్పిస్తామన్నారు. ధాన్యం నిల్వ చేయడానికి గోడౌన్లు కట్టుకోవడానికి స్థలాలు కూడా ఇస్తామన్నారు. లాజిస్టిక్ పార్కుల నిర్మాణానికి అవసరమైతే 100 ఎకరాల స్థలమైనా కేటాయిస్తామన్నారు. ప్రతి మండలంలో గోడౌన్ల నిర్మాణం, మిల్లుల ఏర్పాటుకు అనుగుణంగా 2-4 స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సీఎం సూచించారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడానికి సహకారం అందిస్తామన్నారు.మహిళా సంఘాలే సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్పస్ ఫండ్ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి మహిళ ఇందులో కొంత పెట్టుబడి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం పట్టణాల్లో అవసరమైన భూములను నామమాత్ర ధరకు 30 ఏళ్లకు లీజ్‌కు ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సీఎం సూచించారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరెలను పంట పొలాల్లో పిట్టలను పారద్రోలడానికి వాడారని.. ఆడబిడ్డలకు తాము నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. త్వరలోనే పట్టణాల్లోని ఆడబిడ్డలకు కూడా చీరలు పంచుతామన్నారు. గతంలో పాలపిట్ట రంగు చీర ఇస్తే ఇప్పుడు చిలక పచ్చ రంగు చీరలను ఇస్తున్నామన్నారు. చాలా మంది సొంత చెల్లెళ్లను ఇంట్లో నుంచి అన్నలు వెళ్లగొడుతున్నారు. ఈ మధ్యే రాజకీయాల్లో మీరు చూశారంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు.