‘పుష్ప’ స్టై‌లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం నిజాయతీ రాజకీయమా? విజయ్‌పై పళనిసామి తీవ్ర విమర్శలు

Wait 5 sec.

ఎన్నికల్లో వరుస ఓటములతో డీలాపడ్డా అన్నాడీఎంకేకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈ పరిణామాలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘పుష్ఫ’ స్టైల్‌లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం నిజాయతీగల రాజకీయమా? ప్రశ్నించారు. సినిమా పాపులారిటీతో అధికారంలోకి వచ్చినవారికి ప్రజలే బుద్దిచెబుతారని మండిపడ్డారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, కొద్దిసేపటికే పార్టీ కండువా కప్పారని దుయ్యబట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రాజీనామా చేయించి, ఫస్ట్‌ ఫ్లోర్‌లో టీవీకే కండువాలు కప్పుతున్నారని ఈపీఎస్ విమర్శించారు. తమిళనాడు స్పీకర్ ‘వెన్నుపోటు’ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.అన్నాడీఎంకేకు చెందిన ధర్మపురం ఎమ్మెల్యే సత్యభామ, మధురాంతకం ఎమ్మెల్యే మరగతమ్ కుమార్‌వేల్, పెరుందురయ్ ఎమ్మెల్యే జయకుమార్ రాజీనామాలను స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆమోదించారు. ‘‘ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను తమ స్వంత చేతిరాతతో వ్యక్తిగతంగా సమర్పించాలి.. ఈ విధానాన్ని పాటించకపోతే, విచారణ జరపవచ్చు. వారు లేఖలను నేరుగా వ్యక్తిగతంగా సమర్పించినందున, వెంటనే నిర్ణయం తీసుకున్నాం’’ అని తన నిర్ణయంపై స్పీకర్ వివరణ ఇచ్చారు. వీరంతా టీవీకేలో చేరే అవకాశం ఉంది. విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్‌తో పాటు ఈ మూడు స్థానాలకు ఉప-ఎన్నిక జరగనుంది. విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా అన్నాడీఎంకే సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని రెబల్స్ వర్గంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. స్పీకర్‌ను కలిసిన వెంటనే, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే మంత్రి ఆదవ్ అర్జునను కలిశారు. దీంతో, జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగంలో చేరబోతున్నారనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశారు. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ టీవీకేకు మద్దతుగా ఓటు వేసిన 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల హోదాకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ప్రస్తుతం అన్ని పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి, నేను వాటిని పరిశీలించి తర్వాత నిర్ణయం ప్రకటిస్తాను. పార్టీ విప్ ఎవరో ప్రకటించడానికి గడువు అంటూ ఏమీ లేదు. నేను ఈ విషయాన్ని సమీక్షించి తగిన సమయంలో అధికారిక ప్రకటన చేస్తాను’’ అని అన్నారు.