టీమిండియా ఉమెన్స్ టీమ్ కెప్టెన్ పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంది. భారత్ వేదికగా గతేాడాది స్వదేశంలో జరిగిన మహిళల ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు ఆమెకు ఈ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో రెండు పద్మ విభూషణ్, ఆరు పద్మ భూషణ్, 58 పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేశారు. 2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఐదు పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. మిగిలిన అవార్డులను రెండో విడతలో అందిస్తారు. అయితే, రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకకు హర్మన్ ప్రీత్ కౌర్ క్రీమ్ కలర్ సంప్రదాయం దుస్తుల్లో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది జనవరిలోనే ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డుల్లో భాగంగా హర్మన్ ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించగా.. ఇప్పుడు ఆ అవార్డును అందుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పటికీ, ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. పద్మశ్రీ అవార్డులు అందుకున్న క్రీడాకారుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. విజయ్ అమృత్‌రాజు - పద్మ భూషణ్, బల్దేవ్ సింగ్ - పద్మశ్రీ, భగవందాస్ రైక్వార్ - పద్మశ్రీ, హర్మన్ ప్రీత్ కౌర్ భుల్లర్ - పద్మశ్రీ, కె పాజనివేల్ - పద్మశ్రీ, ప్రవీణ్ కుమార్ - పద్మశ్రీ, రోహిత్ శర్మ - పద్మశ్రీ, సవితా పునియా - పద్మశ్రీ. ఇందులో క్రికెట్ విభాగం నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే అవార్డులు దక్కగా.. మిగతా స్పోర్ట్స్ విభాగాల నుంచి ఆరుగురు అవార్డులు అందుకున్నారు. టీ20 వరల్డ్‌కప్‌తో పాటు టీమిండియాను ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిపినందుకు రోహిత్‌కు పద్మశ్రీ దక్కగా.. హర్మన్‌కు తొలిసారి భారత్‌కు మహిళల వన్డే వరల్డ్ కప్ అందించినందుకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది.