జోసెఫ్ విజయ్ నాయకత్వంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ మనుగడపై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే సర్కారు రెండేళ్లు కూడా కొనసాగదని స్టాలిన్‌ జోస్యం చెప్పారు. శనివారం జరిగిన డీఎంకే యువజన విభాగం నిర్వాహకుల సమావేశంలో స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యువజన విభాగం సోషల్ మీడియాలో చురుకుగా ఉండాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. సొంతంగా కంటెంట్‌ క్రియేట్‌ చేసేలా యూత్ వింగ్‌క వర్క్‌షాపులను నిర్వహించాలని ఉదయనిధి స్టాలిన్‌కు డీఎంకే అధినేత సలహా ఇచ్చారు. సినీ గ్లామర్ వల్లే టీవీకే టీవీకే గెలిచిందని, ఇది రాజకీయ చైతన్యం ఏ మాత్రం కాదని అన్నారు. ఈ ఆకర్షణ తాత్కాలికమేనని, ఈ సర్కారు రెండేళ్లు కూడా కొనసాగదని వ్యాఖ్యానించారు. తల్లిని పిల్లలు వెతికినట్టు జనం కొద్దిరోజుల్లో డీఎంకేను వెతుక్కుంటూ వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి కొద్ది రోజుల ముందు కూడా విజయ్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండరని, మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.డీఎంకే యూత్ విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటకుండా తమ కూటమిలోని పార్టీల దయాదాక్షిణ్యాలతోనే టీవీకే అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. తమ మిత్రపక్షాలు కొన్ని స్టాలిన్‌ అనుమతితో విజయ్‌కు మద్దతు ఇస్తే.. రెండు దశాబ్దాలు తమతో కలిసున్న కాంగ్రెస్‌ మాత్రం వెన్నుపోటు పొడిచిందని ఉదయనిధి విమర్శించారు. దేశంలో బీజేపీ గెలవడానికి మోదీ, అమిత్‌షా కారణమని ఇన్నాళ్లు భావించామని, నిజానికి కాంగ్రెస్సే కారణమనే విషయం ఇప్పుడు తెలిసిందని దుయ్యబట్టారు. తమిళనాడులో డీఎంకే వల్లే కాంగ్రెస్‌కు ఐదు ఎంపీ సీట్లు వచ్చాయని, ఇప్పుడేమో పదవుల కోసం చెప్పా పెట్టకుండా కూటమి నుంచి వెళ్లిపోయిందని ఆరోపించారు. కనీస కృతజ్ఞత, నాగరికత లేని కాంగ్రెస్ పార్టీని ఇకపై నమ్మబోమని, వారికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని తమిళనాడు ప్రతిపక్ష నేత మండిపడ్డారు.