మీ పిల్లలకు 18 ఏళ్లు వచ్చే సరికి ఇలా చేతికి రూ. 1 కోటి.. ఏ వయసులో చేరితే నెలకు ఎంత కట్టాలి?

Wait 5 sec.

: పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో రోజురోజుకూ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇక విద్యా ద్రవ్యోల్బణం అంతకుమించి పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పిల్లల చదువులకు అయ్యే ఖర్చు భరించడం సగటు తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతోంది. పిల్లల భవిష్యత్తు కోసం ప్లానింగ్ అంటే కేవలం మంచి స్కూల్‌లో అడ్మిషన్ ఇప్పిస్తే సరిపోదు. ఇందుకోసం.. 18 ఏళ్లు వచ్చే సరికి వారికి బలమైన ఆర్థిక భద్రత కల్పించగలగాలి. అందుకే.. చాలా మంది పేరెంట్స్.. మ్యూచువల్ ఫండ్లలో సిప్ పెట్టుబడులవైపు మొగ్గుచూపుతున్నారు. నెలనెలా ఎంతో కొంత ఆదా చేస్తూ.. వారికి భవిష్యత్తు కోసం అంటే పైచదువులు, పెళ్లిళ్లు, ఇతర ఆర్థిక ఇబ్బందుల్లేకుండా ముందుగానే చూసుకుంటున్నారు. చాలా మందికి దీని గురించి సరైన అవగాహన ఉండట్లేదు. అయితే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే పేరెంట్స్.. పెట్టుబడులు ప్రారంభిస్తే.. నెలకు చిన్న మొత్తమే పెట్టుబడి పెట్టినా.. దీర్ఘకాలంలో అంటే పిల్లలు మేజర్ అయ్యే సమయానికి ( 18 ఏళ్ల వరకు) పెద్ద కార్పస్ సృష్టించవచ్చని చెబుతున్నారు. కాస్త ఆలస్యంగా ప్రారంభించినా.. పిల్లలు 18 ఏళ్ల వయసు వచ్చే సరికి వచ్చే నిధి మొత్తం తగ్గుతుంటుంది. మ్యూచువల్ ఫండ్లలో చాలా వరకు కాంపౌండింగ్ కారణంగా సంపద పెరుగుతుంటుంది. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీపై వడ్డీ వస్తుంటుంది. అందుకే చిన్నప్పుడే ప్రారంభిస్తే.. అధిక రాబడి వస్తుంది. చాలా వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు సగటున వార్షిక ప్రాతిపదికన 12 శాతం వరకు రిటర్న్స్ అందిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పిల్లలు ఏ వయసులో ఉన్నప్పుడు.. తల్లిదండ్రులు నెలకు ఎంత సిప్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే.. వారికి 18 ఏళ్లు వచ్చే సరికి కోటి రూపాయలు వస్తాయో తెలుసుకుందాం. ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం.. ఇబ్బందుల్లేకుండా ఉండాలంటే రూ. కోటి సరిపోతాయనుకుంటే.. ఆ కోటి కోసం ఎంత పొదుపు చేయాలో చూద్దాం. ఎంత సిప్ చేస్తే.. ఎన్నేళ్లకు రూ. కోటి వస్తుంది?పిల్లలు పుట్టిన వెంటనే అంటే ఏడాదిలోపు పెట్టుబడులు ప్రారంభిస్తే.. 18 ఏళ్లకు రూ. కోటి వచ్చేందుకు నెలనెలా రూ. 14,050 సిప్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకు మూడేళ్ల వయసులో చేరితే నెలకు సిప్ పెట్టుబడి రూ. 21,011 కి పెరుగుతుంది. అప్పుడు 15 ఏళ్లలో కోటి కూడబెట్టొచ్చు. ఐదేళ్ల వయసులో చేరితే మరో 13 ఏళ్లలో రూ. కోటి రావాలంటే నెలకు రూ. 27,946 చొప్పున సిప్ చేయాలి. 8 ఏళ్లకు అయితే సిప్ పెట్టుబడి రూ. 44,636 అవుతుంది. పదేళ్లకు చేరితే మరో 8 ఏళ్లలో రూ. కోటి టార్గెట్ కార్పస్ చేరుకోవాలంటే నెలకు సిప్ రూ. 63,685 చేయాల్సి ఉంటుంది. కాబట్టి.. చిన్న వయసులోనే ప్రారంభిస్తే.. నెలనెలా తక్కువ మొత్తం సిప్ చేస్తే.. భారీ కార్పస్ సృష్టించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.