భూదాన్ స్కామ్‌లో పొలిటికల్ లింకులు? ఈడీ విచారణకు హాజరైన సీనియర్ ఐఏఎస్

Wait 5 sec.

తెలంగాణలో సంచలనం సృష్టించిన భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తీవ్ర అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ గతంలోనే ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇదివరకు 2024లోనే అమోయ్ కుమార్‌ను ఈడీ అధికారులు పలుమార్లు సుదీర్ఘంగా ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తాజాగా ఈ నెల 25న వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేయడంతో ఆయన హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు.అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో మహేశ్వరం పరిధిలోని సుమారు 42 ఎకరాల విలువైన భూదాన్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఈ భూముల బదలాయింపు ప్రక్రియలో పెద్ద మొత్తంలో అక్రమంగా నిధులు, డబ్బు చేతులు మారినట్లు బలమైన ఆధారాలు లభించాయి. ముఖ్యంగా 22-A (నిషేధిత భూముల జాబితా) లో ఉన్న ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించడం ద్వారా అమోయ్ కుమార్ భారీగా ఆర్థిక లబ్ధి పొందారని ఈడీ అనుమానిస్తోంది. నాడు ధరణి పోర్టల్ వేదికగా ఈ భూములకు సంబంధించి రాత్రికి రాత్రే మార్పులు చేర్పులు జరగడం, నిషేధిత జాబితాలోని భూములకు రిజిస్ట్రేషన్ పూర్తి కావడం ఆ వెంటనే కొత్త పాస్ పుస్తకాలు జారీ కావడం వంటి అంశాలపై అటు రాష్ట్ర పోలీసులు, ఇటు ఈడీ అధికారులు సంయుక్తంగా దృష్టి పెట్టారు.అమోయ్ కుమార్ హయాంలో జరిగిన సేల్ డీడ్లు 1209, 1212, 4594 లలో భారీ ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు, అవకతవకలు జరిగాయని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించింది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు వీలుగా ఆయనను ఇవాళ మరోసారి విచారిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ భూముల వ్యవహారం వెనుక కేవలం అధికారులే కాకుండా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు కీలక పెద్దల హస్తం, పాత్ర కూడా ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈనాటి విచారణలో ఐఏఎస్ అధికారి నుంచి ఈడీ ఎలాంటి కీలక రహస్యాలు, రాజకీయ లీంకులను రాబట్టబోతోంది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, ఐఏఎస్ వర్గాల్లో సస్పెన్స్‌గా మారింది.