తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ పాలనపై ఫోకస్ పెట్టారు.. శాఖలవారీగా సమీక్షలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు.. ఆడవారి భద్రత కోసం '' (ఎస్టీఎఫ్‌)ను తీసుకొచ్చారు. ఎస్టీఎఫ్‌ బాధ్యతల్ని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి కె భవానీశ్వరికి అప్పగించిన సంగతి తెలిసిందే.. ఇటీవల ఆమెను సింగప్పెన్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌‌కు చీఫ్‌గా నియమించారు. ఐజీపీ (ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్) హోదా ఉన్న అధికారిని నియమించాలని భావించారు.. ఈ క్రమంలో భవానీశ్వరి ట్రాక్‌ రికార్డ్‌ గురించి తెలిసి ఆమెకు ఎస్టీఎఫ్‌ బాధ్యతలు అప్పగించారు. భవానీశ్వరి వెంటనే రంగంలోకి దిగారు.. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో మహిళల రక్షణ కోసం టీమ్‌లను రంగంలోకి దించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాల్లో ఈ విభాగానికి సంబంధించి అవసరమైన పోలీసుల నియామకాలపై ఫోకస్ పెట్టిన్లు తెలుస్తోంది. మహిళల భద్రతపై నిఘా పెట్టడంతో పాటుగా మహిళల నుంచి ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను తెస్తున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో పోలీస్ వ్యవస్థలను బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సాధారణ పోలీసులకు అదనంగా ఎస్టీఎఫ్‌ బృందాలు పనిచేస్తాయి. మహిళలపై నేరాలు జరిగితే విచారణను వేగవంతం చేసి నేరస్థులకు వేగంగా శిక్ష పడేలా చేయనున్నారు.. అలాగే బాధితులకు అండగా నిలుస్తారు. తమిళనాడులో ఎస్టీఎఫ్‌ టీమ్‌కు కొన్ని ప్రత్యేక అధికారాల్ని ఇస్తున్నారు.. తప్పు చేసిన వారికి భయముండేలా సమాజంలో పోలీసులు కనిపించేలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. పెట్రోలింగ్‌ విధానాన్ని మరింత మెరుగుపరిచి ఆడవారికి మరింత భద్రత కల్పించనున్నారు. ఎస్టీఎఫ్‌ టీమ్‌లను రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విద్యాసంస్థలు, ఐటీ కారిడార్లు లాంటి రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధుల్లో ఉండేలా ప్లాన్ చేయనున్నారు. భవానీశ్వరిది తమిళనాడు కాగా.. తండ్రి పోలీస్‌శాఖలో డీఎస్పీగా పనిచేశారు. ఆమె కూడా తండ్రి స్ఫూర్తి, ఆయన సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకుని ఐపీఎస్ లక్ష్యంగా ముందుకు సాగారు. ఇంటర్‌ చదివిన తర్వాత పోలీస్ ఉద్యోగం సాధించారు.. ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యంతో ఉద్యోగం చేస్తూనే డిగ్రీ కూడా చదివారు. కష్టపడి చదివి ఎంఏ, ఎంఫిల్‌ పూర్తి చేశారు.. చివరికి అనుకున్నది సాధించారు. ఆమె 2002లో ఐపీఎస్‌‌‌ శిక్షణకు ఎంపికయ్యారు.. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఏడాదిన్నిర పాటూ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆమె తమిళనాడు కేడర్‌లో కన్యాకుమారి ఎస్పీగా, చెన్నైలో డీసీపీగా, చెన్నై ట్రాఫిక్‌ ఏసీపీగా, ఎస్‌ఐసీ ఐజీగా, సీఎంఆర్‌ఎల్‌ సీఎస్‌వోగా, డీవీఏసీ జేడీగా, వెస్ట్‌జోన్‌ డీఐజీగా పనిచేశారు. భవానీశ్వరి ప్రస్తుతం ఎస్టీఎఫ్‌ ఐజీపీగా కీలక బాధ్యతలు తీసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ భవానీశ్వరి తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు, అవార్డులు అందుకున్నారు. ఆమె 2017లో విశిష్ట సేవా పతకం, 2023లో ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్స్‌ పోలీస్‌ మెడల్‌ వచ్చింది. 2024లో కృష్ణగిరి జిల్లాలో ఎన్‌సీసీ బాలికల క్యాంప్‌లో లైంగిక వేధింపుల కేసులో ఏర్పాటు చేసిన సిట్‌‌ను లీడ్ చేశారు. కరోనా సమయంలో తమిళనాడు స్పెషల్ నోడల్‌ అధికారిణిగా బాధ్యతలు నిర్వహించారు.