డీజిల్ ధరలు పైపైకి.. బస్సు ఛార్జీల పెంపు..? టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ

Wait 5 sec.

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీయంగా డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపకూడదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ () కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత తరుణంలో బస్సు ఛార్జీలను పెంచే ఆలోచన ఏదీ సంస్థకు లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతానికి టికెట్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని.. పాత ఛార్జీలతోనే బస్సులు నడపనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడి ఇంధన ధరలు ఒక చోట స్థిరపడిన తర్వాత.. అప్పటి పరిస్థితులను బట్టి ఛార్జీల సవరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.ఈ ఇంధన ధరల పెంపుదల టీజీఎస్ఆర్టీసీ అంతర్గత ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. సంస్థ అంతర్గత గణాంకాల ప్రకారం.. లీటర్ డీజిల్ ధర కేవలం ఒక్క రూపాయి పెరిగినా.. సంస్థకు నెలకు అదనంగా రూ. 1 కోటి 28 లక్షల అదనపు భారం పడుతుంది. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం వల్ల ఇప్పటివరకు లీటరుపై ఏకంగా రూ. 6 వరకు ధర పెరిగింది. ఈ లెక్కన సంస్థపై ప్రతి నెలా కనీసం రూ. 7.68 కోట్ల ఆర్థిక భారం పడాల్సి ఉంది. ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీ పరిధిలో మొత్తం 10,130 బస్సులు నడుస్తుండగా.. వీటన్నింటికీ కలిపి ప్రతి రోజు సుమారు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఈ లెక్కన సంస్థకు నెలకు దాదాపు 1.80 కోట్ల లీటర్ల డీజిల్ అవసరమవుతుందని అంచనా.రోజువారీగా జరిగే 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగానికి పెరిగిన రూ. 6 చొప్పున లెక్కిస్తే సంస్థపై రోజుకు రూ. 36 లక్షల అదనపు భారం పడుతోంది. ఈ విధంగా నెలవారీ సగటు వినియోగం 1.80 కోట్ల లీటర్లపై లెక్కిస్తే.. ఆర్టీసీపై నెలకు రూ. 10 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఒకవేళ రద్దీ పెరిగి నెలవారీ గరిష్ట వినియోగం 2 కోట్ల లీటర్ల పరిమితిని తాకితే.. ఈ ఆర్థిక భారం నెలకు ఏకంగా రూ. 12 కోట్ల మార్కును చేరుకునే ప్రమాదం ఉంది. రోజుకు రూ. 36 లక్షల పైచిలుకు వస్తున్న ఈ భారీ నష్టాన్ని సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సంస్థే స్వయంగా భరిస్తోంది. ధరల సంక్షోభంలోనూ ఛార్జీలను స్థిరంగా ఉంచాలని ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి, సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనంగా మారింది.