: స్టాక్ మార్కెట్లలో ముఖ్యంగా ఐపీఓలకు తెగ డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ ఐపీఓ ద్వారా షేర్ల కొనుగోలుకు జనం ఎగబడుతుంటారు. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎన్నో రెట్ల షేర్లకు బిడ్స్ దాఖలు చేస్తుంటారని చెప్పొచ్చు. చాలా వరకు ఐపీఓలు ఓవర్ సబ్‌స్క్రైబ్ అవుతుంటాయి. ఏదైనా కంపెనీ తొలిసారిగా షేర్ల విక్రయం ద్వారా పబ్లిక్ లిస్టింగ్‌లోకి రావడాన్ని ఐపీఓగా చెబుతారు. ఇక్కడ నిర్దిష్ట సమయం సబ్‌స్క్రిప్షన్ పీరియడ్‌లో షేర్ల కొనుగోలు కోసం బిడ్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఐపీఓలు చూస్తే మంచి ప్రీమియంతో మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుంటాయి. అంటే లిస్టింగ్‌తో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. గతేడాది చాలా ఐపీఓలు మార్కెట్లో సందడి చేసినప్పటికీ.. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు పెద్ద ఐపీఓలు రాలేదని చెప్పొచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ పరిస్థితి బాగోలేనందున చాలా ఐపీఓలు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, ఎన్ఎస్ఈ, రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్, ఫ్లిప్‌కార్ట్, ఓయో, జెప్టో ఇలా ఎన్నో పెద్ద కంపెనీల నుంచి ఐపీఓలు ఉన్నా.. ఏదీ ప్రక్రియలో వేగం పుంజుకోలేదు. ఒకవైపు.. రిలయన్స్ జియో వచ్చే ఏడాదికి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ కూడా అదే ఆలోచిస్తోంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ విభాగం.. ప్రాసెస్ ప్రారంభించింది. కానీ ఎప్పుడొస్తుందో తెలియదు. అయినప్పటికీ.. ఇప్పుడు మరో అతిపెద్ద ఐపీఓకు పావులు కదులుతున్నాయి. అదే (). ఇది అతిత్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే నెల అంటే జూన్ తొలి అర్ధభాగంలోనే ఐపీఓ కోసం NSE.. సెబీ దగ్గర డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) పత్రాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇది జూన్ 5-15 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. NSE మార్కెట్ విలువ సుమారు రూ. 4-6 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఐపీఓ ద్వారా సుమారు రూ. 21- 23 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే దేశంలోనే అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలుస్తుంది. డీఆర్‌హెచ్‌పీ అంటే ఐపీఓ కోసం సెబీకి సమర్పించే ప్రాథమిక ముసాయిదా పత్రం. ఇందులో కంపెనీ వ్యాపార విధానం, ఆస్తులు, అప్పులు, నిర్వహణ తీరు, ఆర్థిక పరిస్థితి వంటి పూర్తి వివరాలు ఉంటాయి. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి.. ఐపీఓ ద్వారా వచ్చే నిధుల్ని ఎక్కడ ఉపయోగిస్తారు వంటి వివరాలన్నీ అందులో పేర్కొంటారు. పెట్టుబడిదారులు కూడా ఇది చూసి ఇన్వెస్ట్ చేయాలా లేదా అని నిర్ణయించుకుంటారు. డీఆర్‌హెచ్‌పీ చూసి.. సెబీ ఐపీఓ కోసం ఆమోదం తెలుపుతుంది.