HYD: వాట్సాప్ కాల్‌తో వల.. ట్రేడింగ్ పేరిట రూ.6 కోట్లు ముంచేసిన కేటుగాళ్లు

Wait 5 sec.

ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లు, ట్రేడింగ్ యాప్స్ పేరుతో జరిగే సైబర్ మోసాలకు అంతేలేకుండా పోతోంది. రోజుకో తరహా కొత్త మోసాలతో సైబర్ కేటుగాళ్లు వల విసురుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ సనత్‌నగర్ పరిధిలో నివసించే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన 72 ఏళ్ల సీనియర్ ఎగ్జిక్యూటివ్.. సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మి ఏకంగా రూ. 5.95 కోట్లు పోగొట్టుకున్నాడు. నకిలీ అప్లికేషన్ల ద్వారా విదేశీ కరెన్సీ, కమోడిటీస్ ట్రేడింగ్ పేరిట జరిగిన ఈ భారీ మోసంపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రధాన కార్యాలయ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ హై-ప్రొఫైల్ మోసంపై సైబర్ పోలీసులు వేగంగా దర్యాప్తును ప్రారంభించారు.బాధితుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు సంవత్సరాల క్రితం కావేరి అనే మహిళ నుంచి ఆయనకు మొదటిసారి వాట్సాప్ కాల్ వచ్చింది. తాను ముద్రా వన్, 9ప్రో స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్లలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లు ఆమె పరిచయం చేసుకుంది. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టే విధానాల గురించి వివరిస్తూ.. ఒకవేళ ట్రేడింగ్‌లో నష్టాలు వస్తే వాటిని కవర్ చేయడానికి ప్రత్యేక ఇన్సూరెన్స్ షీల్డ్ కూడా ఉంటుందని నమ్మబలికింది. ఆమె ఇచ్చిన నమ్మకంతో సదరు వృద్ధుడు ఆ నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లను తన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇటీవల ఏప్రిల్ 13 నుంచి మే 11 మధ్య కాలంలో విదేశీ కరెన్సీలు, కమోడిటీస్ ట్రేడింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన విడతల వారీగా మొత్తం రూ. 5.95 కోట్లను ఆ యాప్స్ ద్వారా డిపాజిట్ చేశారు. ఆ తర్వాత సదరు ఫేక్ అప్లికేషన్లలోని ట్రేడింగ్ అకౌంట్ స్క్రీన్‌పై లాభాలతో కలిపి మొత్తం రూ.42 లక్షల డాలర్లు ఉన్నట్లు డిస్‌ప్లే చూపించింది. దాంతో ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి ఆయన ప్రయత్నించగా.. సదరు ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహిస్తున్న సైబర్ నేరగాళ్లు అసలు రంగు బయటపెట్టారు. సెటిల్‌మెంట్ జరగాలంటే క్రెడిట్ లెవరేజ్ కింద ముందస్తుగా మరో రూ.10 లక్షల డాలర్లు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వాళ్లు అడిగిన భారీ మొత్తాన్ని మళ్లీ ఎలా చెల్లించాలా? అని బాధితుడు ఆలోచిస్తుండగానే మే మూడో వారంలో సదరు యాప్ నిర్వాహకుల నుంచి ఒక షాకింగ్ మెసేజ్ వచ్చింది. ముద్రా వన్, 9ప్రో అప్లికేషన్ల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా TGCSB పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.