ప్రపంచంలో 19 మందిలోనే కనిపించిన అత్యంత అరుదైన వ్యాధి.. హైదరాబాద్ యువతి ప్రాణాలు కాపాడిన కిమ్స్ డాక్టర్లు

Wait 5 sec.

ప్రపంచ , కేవలం 19 మందిలో మాత్రమే బయటపడిన వెబర్‌ క్రిస్టియన్‌ వ్యాధితో బాధపడుతూ కాలేయ వైఫల్యానికి గురైన హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువతికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. విదేశాల నుంచి ప్రత్యేకమైన మెడిసిన్ తెప్పించి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆమెను కాపాడినట్లు ఆసుపత్రి రుమటాలజీ, క్లినికల్‌ ఇమ్యూనాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ శరత్‌చంద్రమౌళి, హెపటాలజీ నిపుణుడు డాక్టర్ కె.ఎన్.చందన్‌కుమార్ వెల్లడించారు. నగరానికి చెందిన యువతికి గత 2018లోనే కాళ్లు, చేతులపై నొప్పితో కూడిన గడ్డలు రావడం, తరచూ తీవ్రమైన జ్వరం రావడంతో కిమ్స్ వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి వెబర్‌ క్రిస్టియన్‌ సిండ్రోమ్‌గా నిర్ధారించింది. ఈ వ్యాధి వల్ల చర్మం కింద ఉండే కొవ్వు పొరల్లో తీవ్రమైన వాపు వస్తుంది. అప్పట్లో ముందే గుర్తించి చికిత్స అందించడంతో ఆమె కోలుకున్నారు. వ్యాధి పూర్తిగా అదుపులోకి రావడంతో ఆమె గత ఆరేళ్లుగా మందులు వాడటం నిలిపివేశారు.అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 17న ఆమె మరోసారి తీవ్రమైన జ్వరం, కామెర్లు, మెదడులో రక్తస్రావంతో అత్యంత విషమ స్థితిలో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె కాలేయం పూర్తిగా పనిచేయడం మానేసినట్లు గుర్తించారు. ఆ ప్రభావం మెదడుపై పడి గ్రేడ్‌-4 హెపాటిక్‌ ఎన్సెఫలోతి స్థితికి చేరుకోవడంతో ఆమెను వెంటనే ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. ప్లాస్మాఫెరెసిస్‌ ప్రక్రియ ద్వారా కాలేయానికి బయట నుంచి సపోర్ట్ అందిస్తూనే.. అత్యవసరంగా లివర్ మార్పిడి చేయాలని వైద్యులు భావించారు. ఈ క్రమంలో ఆమె రక్తంలో ఫెరిటిన్ స్థాయిలు అసాధారణంగా పెరగడాన్ని గమనించిన వైద్య బృందం.. ఆమె రోగ నిరోధక వ్యవస్థ అదుపు తప్పి మ్యాక్రోఫేజ్‌ యాక్టివేషన్‌ సిండ్రోమ్‌ అనే ప్రాణాంతక ఇన్‌ఫ్లమేటరీ స్థితికి చేరుకున్నట్లు గుర్తించి చికిత్సా విధానాన్ని మార్చారు. వెబర్‌ క్రిస్టియన్‌ సిండ్రోమ్‌ నేరుగా కాలేయానికి సోకి ఇలా ఫల్మినెంట్‌ హెపటిక్‌ ఫెయిల్యూర్ జరగడం ప్రపంచ వైద్య రంగంలోనే ఇది కేవలం మూడో కేసు మాత్రమేనని వైద్యులు స్పష్టం చేశారు.ఈ అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో కిమ్స్‌కు చెందిన రుమటాలజీ, హెపటాలజీ, లివర్ మార్పిడి ఇంటెన్సివ్ కేర్, క్రిటికల్ కేర్ విభాగాల నిపుణులు సమన్వయంతో చికిత్స అందించారు. రోగికి శక్తిమంతమైన యాంటీబయోటిక్స్, పల్స్ స్టెరాయిడ్స్, ఇమ్యూనో మాడ్యులేటరీ థెరపీలను ప్రారంభించారు. వీటితో పాటు అనాకిన్రా అనే అరుదైన ఐఎల్‌-1 రిసెప్టర్ యాంటగనిస్ట్ మెడిసిన్ ప్రత్యేకంగా విదేశాల నుంచి రప్పించి ఆమెకు ఇచ్చారు. ఈ ఔషధం అందించిన కొద్ది సేపటికే రోగి శరీరంలో వాపు తగ్గడం ప్రారంభమై కాలేయం పనితీరు క్రమంగా పుంజుకుంది. అద్భుతమైన రీతిలో కొన్ని రోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకోవడంతో వెంటిలేటర్ తొలగించి ఆరోగ్యకరమైన స్థితిలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు డాక్టర్లు తెలిపారు.