తమిళనాడు సీఎం విజయ్‌తో 4 రోజుల కింద భేటీ.. నేడు చంద్రబాబుతో మీటింగ్.. ఎవరీ ప్రీతారెడ్డి?

Wait 5 sec.

ముఖ్యమంత్రి అన్న తర్వాత నిత్యం అనేక మంది ప్రముఖులు కలుస్తుంటారు. వివిధ రంగాలకు చెందిన వీవీఐపీలతో పాటుగా ప్రజాప్రతినిధులు.. పార్టీ కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు సీఎం పేషీ వద్దకు వస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రీతారెడ్డి అనే మహిళ సీఎం చంద్రబాబుతో తాజాగా భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగు రోజుల కిందట (మే 19) తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన ప్రీతా రెడ్డి.. శనివారం రోజున చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఎవరీ ప్రీతా రెడ్డి అనే దానిపై ఆసక్తి నెలకొంది. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజైస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా డాక్టర్ ప్రీతా రెడ్డి వ్యవహరిస్తు్న్నారు.మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవడం ఒక గొప్ప అవకాశంగా ప్రీతా రెడ్డి పేర్కొన్నారు. సమ్మిళిత అభివృద్ధి, నూతన ఆవిష్కరణల ఆధారంగా వృద్ధి, ప్రజా సేవ పట్ల చంద్రబాబుకు ఉన్న అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయమన్నారు. ఏపీలో మహిళల ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధి, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తీసుకురావటం వంటి అనేక ముఖ్యమైన అంశాలపై తాము చర్చించినట్లు ప్రీతారెడ్డి తెలిపారు. వేగంగా మారిపోతున్న నేటి ప్రపంచంలో, అభివృద్ధి ద్వారా అందరికీ అవకాశాలను కల్పించాలనే చంద్రబాబు నమ్మకం తన హృదయంలో నాటుకుపోయిందన్నారు డాక్టర్ ప్రీతారెడ్డి.ఏపీలో సమ్మిళిత, సుస్థిర వృద్ధికి అపారమైన సామర్థ్యం ఉందని.. ప్రజలను మరింత శక్తివంతం చేయడం, దీర్ఘకాలిక ప్రభావాన్ని నిర్మించడం గురించి చంద్రబాబు మాట్లాడిన మాటల్లో స్ఫూర్తి కనిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నూతన అధ్యాయం వైపు నడిపిస్తున్న చంద్రబాబుకు నిరంతర శక్తి, విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు డాక్టర్ ప్రీతారెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు నాలుగు రోజుల కిందట తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు ప్రీతారెడ్డి. తమిళనాడుకు నాయకత్వం వహించే బాధ్యతను స్వీకరించినందుకు విజయ్‌ను అభినందించారు. విజయ్ ఆలోచించే తీరు, వినయం, తమిళనాడు ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత తనపై చెరగని ముద్ర వేశాయని ప్రీతారెడ్డి ట్వీట్ చేశారు. తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడే విధానంలో ఒక బలమైన స్ఫూర్తి ఉంటుందన్నారు. తమిళనాడులో ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు, మహిళప్రత్యేక సంరక్షణను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత, అభివృద్ధిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేందుకు తమిళనాడుకు ఉన్న అపారమైన అవకాశాల గురించి చర్చించినట్లు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, మానవ అభివృద్ధి రంగాలలో విజయ్ నాయకత్వంతో తమిళనాడు ప్రత్యేకంగా నిలుస్తుందని.. యువ, లక్ష్యసాధన గల నాయకత్వంతో తమిళనాడుకు అభివృద్ధిలో అసాధారణమైన కొత్త అధ్యాయాన్ని లిఖించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ప్రజా సేవ అనే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి విజయ్‌కు శక్తి, విజయం కలగాలని డాక్టర్ ప్రీతారెడ్డి ఆకాంక్షించారు.