ఇటీవల వెలువడిన తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు.. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తన పుట్టిన రోజు సందర్భంగా ఊహించని బహుమతి అందించారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తాజాగా పేద విద్యార్థులను విమానం ఎక్కించారు. మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను విమానం ప్రయాణించేలా చేస్తానని ఇప్పటికే చెప్పిన మంత్రి కోమటిరెడ్డి.. తాను ఇచ్చిన మాటను తన పుట్టిన రోజున నెరవేర్చారు. 2 రోజుల పాటు 14 మంది విద్యార్థులను వైజాగ్, అరకు పర్యటనకు పంపించారు. 10వ తరగతిలో టాప్ మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు.. శనివారం రోజున తన బర్త్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా ముచ్చటించిన మంత్రి.. వారి భవిష్యత్ ఆలోచనలు, ఉన్నత చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారు ఉన్నత చదువులు చదువుకునేందుకు తాను భరోసాగా ఉంటానని వారికి హామీ ఇచ్చి నూతన ఉత్తేజాన్ని నింపారు. వారి భవిష్యత్ ఆలోచనలు కేవలం ఉద్యోగాల వరకే పరిమితం కాకుండా.. ఉద్యోగాలను సృష్టించేలా ఎదగాలని సూచించారు.ఈ క్రమంలోనే తన బర్త్ డే సర్‌ప్రైజ్ గిఫ్ట్ కింద విద్యార్థులకు విమాన ప్రయాణం కల్పించారు. 2 రోజుల పాటు విశాఖపట్నం, అరకు లోయ వంటి ప్రదేశాల్లో వారిని తిప్పి చూపించనున్నారు. ఈ టూర్ విమాన టికెట్లను మంత్రి వారికి అందించారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 14 మంది విద్యార్థుల బృందం విమానంలో విశాఖకు బయల్దేరింది. ఇక విశాఖలో ఆ విద్యార్థులందరికీ స్టార్ హోటల్లో మంత్రి బస ఏర్పాట్లు చేశారు. వారికి ఎలాంటి అవస్థలు రాకుండా చూసుకునేందుకు టీచర్, తన వ్యక్తిగత సిబ్బందిని కూడా మంత్రి కోమటిరెడ్డి పంపించారు. ఫ్లైట్ ట్రిప్ ఎంజాయ్ చేయండి.. హ్యాపీ జర్నీ అంటూ విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు.