‘ఆమెను ఎవరూ రక్షించలేరు’.. ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేసిన ఇరాన్ ఉగ్రవాది వార్నింగ్

Wait 5 sec.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్ సహా ఆ దేశ అగ్రనేతలు పలువురు మరణించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హత్యకు కుట్రచేసినట్టు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం వెలువరించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) గ్రూపుతో సంబంధాలున్న వ్యక్తి ఈ కుట్ర చేసినట్టు తెలిపింది. జనవరి 2020లో ఐఆర్జీసీ కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇవాంకాను చంపేందుకు సిద్ధమయ్యాడని, ప్లాన్‌ అమలయ్యేలోపే అరెస్టయ్యాడని తెలిపింది.న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం... ఇరాక్ జాతీయుడు మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సాదీ (32) ని కొద్ది రోజుల కిందట తుర్కియేలో అరెస్ట్ చేసి.. అమెరికాకు తరలించారు. విచారణ సమయంలో అతడు కీలక సమాచారం వెల్లడించినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇవాంకా ట్రంప్‌ను చంపుతానని, ఆమెను ఎవరూ కాపాడలేరని శపథం చేశాడని పేర్కొన్నారు. నిందితుడి వద్ద ఫ్లోరిడాలోని ఇవాంక కుటుంబం నివాసం ఉండే భవనం బ్లూప్రింట్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ భవనం ఫొటోను అల్ సాదీ సోషల్ మీడియాలోనూ షేర్ చేసినట్లు తెలుస్తోంది.ఇరాన్ అగ్రశ్రేణి సైనిక అధికారి అయిన ఖాసీం సులేమానీ.. ఖుడ్స్ ఫోర్స్‌కు కమాండర్‌గా ఉన్న సమయంలో అతడ్ని అమెరికా హత్య చేసింది. జనవరి 2020లో బాగ్దాద్ విమానాశ్రయంలో అతడిపై అమెరికా సైన్యం మిస్సైల్ దాడిచేసి హతమార్చింది. తన గురువు మరణానికి ప్రతీకారం తప్పదని బహిరంగంగానే ప్రకటించిన మహమ్మద్... 'మీ రాజసౌధాలు, సీక్రెట్ సర్వీస్ ఏవీ మిమ్మల్ని రక్షించలేవు' అని ఇవాంకా ఫ్యామిలీని హెచ్చరిస్తూ అరబిక్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘‘మేము ప్రస్తుతం నిఘా, విశ్లేషణ దశలో ఉన్నాం.. నేను మీకు చెప్పాను కదా, మా ప్రతీకారం తీర్చుకోవడం కేవలం సమయం మాత్రమే పడుతుంది’’ఇరాన్- ఇరాక్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లో అతడు కీలక పాత్రధారని అమెరికా అధికారులు తెలిపారు. వాషింగ్టన్‌లోని ఇరాక్ రాయబార కార్యాలయంలో మాజీ డిప్యూటీ ఎంటిఫాద్ ఖాన్బార్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఖాసిమ్ హత్య తర్వాత అల్-సాదీ ప్రజల వద్దకు వెళ్లి ‘‘ట్రంప్ మన ఇంటిని ఎలా తగలబెట్టాడో, అలాగే మనం కూడా ఆయన ఇంటిని తగలబెట్టడానికి ఇవాంకాను చంపాలి’’ అని చెప్పేవాడు’’ అని అన్నారు.ఎవరీ అల్-సాదీ?జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఇరాక్-ఇరాన్ మిలిటెంట్ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తి అయిన అల్-సాదీని మే 15న తుర్కియేలో అరెస్టు చేసి, అమెరికాకు అప్పగించారు. ఐరోపా, అమెరికాలో జరిగిన పలు దాడులు, దాడి యత్నం ఘటనల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అమెరికా, యూదుల ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన అనేక దాడులకు అతడే ప్లాన్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మార్చిలో ఆమ్‌స్టర్‌డామ్‌లోని బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లన్‌పై జరిగిన పెట్రోల్ బాంబు దాడి, ఏప్రిల్‌లో లండన్‌లో ఇద్దరు యూదులపై జరిగిన కత్తిదాడి, దీనికి ముందు టొరంటోలోని యూఎస్ కాన్సులేట్ భవనంపై జరిగిన కాల్పుల ఘటనల్లో ఇతడి హస్తం ఉన్నట్టు భావిస్తున్నారు. సులేమానీకి చాలా సన్నిహితుడని, అతడిని తండ్రిలా భావించేవాడని ఆ నివేదికలో పేర్కొన్నారు.