ప్రముఖ సినీగేయ రచయిత అనంత శ్రీరామ్, ఆయన మేనమామ మాజీ ఎంపీ చేగోండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ మధ్య మొదలైన ఆస్తి వివాదం రాజకీయ, న్యాయపరమైన మలుపులు తీసుకుంటోంది. చేగోండి సూర్యప్రకాష్ తమను బెదిరిస్తున్నాడని, తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఆరోపణలపై సూర్యప్రకాష్ తీవ్రంగా స్పందించారు. అనంత శ్రీరామ్ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, అవన్నీ పచ్చి అబద్దాలేనని ఆయన పేర్కొన్నారు.అతడు డబ్బు, పరపతి, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వ్యక్తిగతంగా తనను వేధిస్తున్నారని సూర్యప్రకాష్ ఆరోపించారు. కక్షపూరితంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, అందుకే ఆయనపై తాను పరువు నష్టం దావా వేయబోతున్నాని ప్రకటించారు. తనది నిష్కళంకమైన చరిత్రని, ఇప్పటివరకు తనపై కనీసం ఒక్క పోలీస్ కేసు కూడా లేదని సూర్యప్రకాష్ గుర్తు చేశారు. అంతేకాదు, అనంత శ్రీరామ్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు.తమ కుటుంబాల మధ్య అసలు వివాదం ఆస్తులకు సంబంధించిందని మాజీ ఎంపీ కుమారుడు బయటపెట్టారు. తమ తాత చేగొండి కృష్ణమోహన్ రావుకు చెందిన ఆస్తిని అక్రమ మార్గాల్లో అనంత శ్రీరామ్ స్వాధీనం చేసుకున్నారని ఆయన ప్రత్యారోపణలు చేశారు. ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో తన అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని, అందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అతడు ఓ ‘పెద్ద భూ కబ్జా రాయుడు’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు సీవీవీ సత్యన్నారాయణ, ఉమారాణిలను తాను బెదిరించినట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సూర్యప్రకాష్ తేల్చి చెప్పారు. వాళ్లను తాను బెదిరించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. అసత్యమైన ఫిర్యాదులతో అధికారులను అనంత శ్రీరామ్ తప్పుదోవ పట్టించడం మానుకోవాలని సూర్యప్రకాష్ హితవు పలికారు. కేవలం తన స్వార్థంకోసమే వృద్ధులైన తల్లిదండ్రులను బయటకు లాగడం సరికాదని ఆయన విమర్శించారు.ఇదిలా ఉండగా, అనంత శ్రీరామ్ తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. అయితే, సూర్యప్రకాష్ భూ కబ్జా ఆరోపణలు చేస్తూ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేస్తామననడం చర్చనీయాంశమైంది. కుటుంబ వివాదంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, పోలీసులు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.