రైతులకు మద్దతుగా ప్రశ్నించిన కారణంతో జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తెలిపారు. మంగళవారం సాయంత్రం తన ఎక్స్ హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్టు చేసిన మంత్రి.. ఆ డ్రైవర్ ఆర్టీసీ ఉద్యోగి కాదని, అద్దె బస్సు డ్రైవర్ అని తెలిపారు. అతణ్ని ఉద్యోగం నుంచి తప్పించొద్దని అద్దె బస్సు యజమానికి కూడా చెప్పామని మంత్రి స్పష్టం చేశారు. దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డ్రైవర్ అశోక్ రైతుల పక్షాన మాట్లాడారని.. ఆయన మాటలను స్వాగతిస్తున్నారని మంత్రి తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం అలాంటి చర్యలు తీసుకోవాలని బస్సు యజమానికి చెప్పలేదన్నారు. ఇప్పుడే ఆర్టీసీ ఎండీతో మాట్లాడానన్నారు. డ్రైవర్ అశోక్ అద్దె బస్సులో తన పని తాను చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు జగిత్యాల ఆర్డీవో ఆఫీసు సమీపంలో ధర్నా చేస్తున్న సమయంలో.. ముందుగా వడ్లు, మొక్కజొన్న కొనుగోలు గురించి పట్టించుకోండి.. పెట్రోల్ సంగతి తర్వాత చూసుకోవచ్చు అంటూ ఆర్టీసీ డ్రైవర్ అశోక్ తన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సూచించారు. ఈ కారణంతోనే అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించారని ప్రచారం జరిగింది. డ్యూటీకి రావద్దని రిమూవల్ లెటర్ ఇచ్చారని వార్తలొచ్చాయి.ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను డ్రైవర్ బి.అశోక్ విమర్శించాడంటూ.. ధర్మపురి కాంగ్రెస్ ప్రెసిడెంట్ సి.లక్ష్మణ్ ఫిర్యాదుతో అతణ్ని విధుల నుంచి తప్పించాలని కోరుతూ బస్సు యజమానికి జగిత్యాల డిపో మేనేజర్ రాసినట్లు ఉన్న లేఖ సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ ఘటనపై ప్రతిపక్షాలు స్పందించాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. విధుల నుంచి తప్పించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.అశోక్‌ను సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఖండించారు. అశోక్ డ్రైవర్ కావచ్చు, కానీ ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారని.. ఆయన ప్రజా సమస్యల గురించి స్పందించారని హరీశ్ రావు తెలిపారు. వడ్లు కొనండి, మక్కలు కొనండి అని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు.డ్రైవర్ సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలే కాదు.. ప్రశ్నించడాన్ని ఏడో గ్యారంటీగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. ఆ డ్రైవర్‌‌కు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. అశోక్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.