యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడి, చర్చలు విఫలమైతే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే సంకేతాలను పంపింది. అమెరికా- ఇజ్రాయెల్, టెహ్రాన్ ఘర్షణలో ఇరాక్‌లోని ఇరాన్ మద్దతున్న మిలీషియా కీలక పాత్ర పోషిస్తున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం బరాకా ప్లాంట్‌పై జరిగిన దాడి ఇరాక్ నుంచే జరిగిందని, ఇది ‘ఉగ్రవాద’ చర్య అని ఖండించింది. అధ్యక్షుడి సీనియర్ సలహాదారు అన్వర్ గార్గాష్ సోషల్ మీడియాలో ‘ఇరాక్‌లోని ఇరాన్ మిలీషియాలే’ కారణమని ఆరోపించారు.ఈ దాడి ఆందోళనకరమని, ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతకు ఒక ప్రమాదకరమైన సూచికని గార్గాష్ పేర్కొన్నారు. ఈ దాడితో అణు భద్రతను రక్షించే చివరి చర్యగా పరిగణించే బ్యాకప్ విద్యుత్ వ్యవస్థలను యాక్టివేట్ చేయాల్సి వచ్చింది.పశ్చిమాసియాలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ అయిన బరాకా.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పనిచేస్తున్న రెండు అణు కేంద్రాలలో ఒకటి. మరొకటి ఇరాక్‌లోని బుష్‌హెర్‌లో ఉంది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, రేడియేషన్ స్థాయిలు కూడా సాధారణంగానే ఉన్నాయని అధికారులు నివేదించారు. అయినప్పటికీ, పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కీలకమైన పౌర మౌలిక సౌకర్యాలకు ఎంతటి ముప్పు పొంచి ఉందో ఈ ఘటన నిరూపించింది.బ్లూమ్‌బెర్గ్ విశ్లేషకుల ప్రకారం... ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణపై అనిశ్చితి పెరుగుతున్న తరుణంలో ఇది టెహ్రాన్ (ఇరాన్) నుంచి వచ్చిన ఒక హెచ్చరిక సంకేతంలా కనిపిస్తోంది. ‘‘ఇది ఇరాన్ చేసిన హెచ్చరిక దాడి.. గల్ఫ్ దేశాలపై ఒత్తిడిని కొనసాగించడానికి ఇరాన్ ఎంచుకున్న మార్గం ఇది. మీరు సురక్షితంగా లేరు.. మేము మీపై నేరుగా దాడి చేయకపోయినా.. మా ప్రాక్సీలు ఆ పని చేస్తాయి’’ అని చెప్పడమే దీని ఉద్దేశం’’ అని దుబాయ్ పబ్లిక్ పాలసీ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ మహ్మద్ బహారూన్ బ్లూమ్‌బెర్గ్‌తో వ్యాఖ్యానించారు.బరకా దాడికి గానీ, లేదా దాదాపు అదే సమయంలో సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన మూడు డ్రోన్‌లకు గానీ అటు ఇరాన్, ఇటు ఇరాక్‌లోని ఇరాన్ మద్దతుగల మిలీషియాలు గానీ బాధ్యత వహించలేదు. ఆ డ్రోన్‌లను అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒక విస్తృత పరిష్కారంగా మార్చేందుకు అమెరికా, ఇరాన్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడి జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందంపై ఆశాభావం, తిరిగి సైనిక చర్యకు దిగుతామనే బెదిరింపులతో శాంతి చర్చల్లో ప్రతిష్టంభన నెలకుంది.మళ్లీ కొత్త దాడులు జరిగితే.. పశ్చిమాసియా వెలుపలకు విస్తరించేలా ప్రతీకారం మరింత శక్తివంతంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో సంబంధం ఉన్న ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా, ఇరాన్ ప్రాంతీయ సైనిక వ్యూహంలో కీలక భాగంగా మారుతున్నాయి. కతైబ్ హెజ్బుల్లా, హరకత్ హెజ్బొల్లా అల్-నుజాబా వంటి గ్రూపులు ఇరాక్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని వందలాది క్షిపణి, డ్రోన్ దాడులు చేసినట్టు ప్రకటించాయి.చాథమ్ హౌస్‌కు చెందిన రెనాడ్ మన్సూర్ మాట్లాడుతూ.. ‘‘ఈ ముఠాలు గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకోవడంతో సహా ఇరాన్ యుద్ధ ప్రయత్నాలలో భాగస్వామ్యం కావాలని IRGC నుంచి నేరుగా ఆదేశాలను అందుకుంటున్నాయి’’ అని చెప్పారు. ఈ యుద్ధంలో ఇరాకీ ముఠాలు గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని 65 కంటే ఎక్కువ దాడులకు పాల్పడ్డాయని, ఈ సంఖ్య ఇంతకంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీఎల్ఈడీ అనే మరో సంస్థ పేర్కొంది.