దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పోక్సో కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలె బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు మేడ్చల్ మల్కాజిరిగి కోర్టు నుంచి అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడిని పేట్ బషీరాబాద్ పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారం రోజుల పాటు బండి భగీరథ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరినప్పటికీ.. కోర్టు మాత్రం 3 రోజులకే అనుమతి ఇచ్చింది. దీంతో ఈ మూడు రోజులు బండి భగీరథ్‌ను విచారణ చేసి.. ఈ కేసులో మరిన్ని విషయాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్‌ను కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మల్కాజిరిగి కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే బాధిత బాలిక, ఆమె తల్లి, బండి భగీరథ్ ఫ్రెండ్స్‌ను విచారణ జరిపిన పేట్ బషీరాబాద్ పోలీసులు.. కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్‌ను కూడా వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. 3 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు తెలిపింది. ఇక పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను బండి భగీరథ్ తరపు లాయర్ కరుణాసాగర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ కోర్టు.. బండి భగీరథ్‌ను కస్టడీకి అనుమతిస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య మాత్రమే విచారణ జరపాలని.. కోరారు. అంతేకాకుండా విచారణకు ముందు, తర్వాత అతడికి మెడికల్ టెస్టులు నిర్వహించాలని కోరారు. విచారణ సమయంలో బండి భగీరథ్‌పైన బలవంతంగా ఎలాంటి పద్దతులు వాడకుండా పోలీసులను ఆదేశించాలని కోర్టుకు ఆయన లాయర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. తన క్లయింట్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. కావాలని, కుట్రపూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని.. అందుకే బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫున లాయర్లు బెయిల్ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేశారు. పోలీసుల కస్టడీ పిటిషన్‌తోపాటు పిటిషన్‌ రెండింటిపై మంగళవారం రోజున వాదనలు విన్న మేడ్చల్ జిల్లా కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించి.. కస్టడీకి అప్పగించింది.మైనర్ బాలికపై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై మే 8వ తేదీన బండి భగీరథ్‌పై పేట్‌ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు అయింది. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు ఈ కేసులో కఠినమైన సెక్షన్లను చేర్చారు. ఈ క్రమంలో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మే 16వ తేదీన హైకోర్టు వాయిదా వేయడంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు బండి భగీరథ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. చర్లపల్లి జైలుకు తరలించారు.