ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ ‘అబ్రహాం అకార్డ్‌‌‌’ మెలిక.. అడకత్తెరలో పోకచెక్కలా పాకిస్థాన్!

Wait 5 sec.

ఇరాన్‌తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం అకార్డ్ తెరపైకి తెచ్చి దిమ్మదిరిగే షాకిచ్చారు. ఈ ఒప్పందంపై సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్థాన్‌ వంటి ముస్లిం దేశాలు సంతకం చేయాలన్న ఆయన పిలుపు డిమాండ్‌‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఏంటీ అబ్రహామ్ అకార్డ్ ఒప్పందాలు? వాటిని ఎందుకు విస్తారించాలని ట్రంప్‌ కోరుకుంటున్నారు? ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి ఎందుకు ముడిపెడుతున్నారు? అనే చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్, పలు గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించడమే లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందాలనే అబ్రహాం అకార్డ్స్. ఇస్లాం, యూదు, క్రైస్తవల్లోని అబ్రహామిక్‌ మూలాల ఆధారంగా ఈ పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు..2020లో ఈ ఒప్పందాలపై యూఏఈ, బహ్రెయిన్, సూడాన్, మొరాకో దేశాలు సంతకాలు చేశాయి. గతేడాది నవంబరులో కజికిస్థాన్ ఇందులో చేరింది. ఇందులోని సౌదీని చేర్పించడానికి అమెరికా విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, గాజాలో హమాస్‌- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఫలించలేదు. అబ్రహాం అకార్డ్స్‌లో చేరే దేశాలు ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తిస్తాయి. ఆ దేశంతో వాణిజ్య, పర్యాటక, భద్రతా రంగాల్లో పరస్పరం సహకారం అందించుకుంటాయి. ఎందుకు కీలకం? పశ్చిమాసియా శాంతిలో అబ్రహాం అకార్డ్స్ కీలకం. వీటి వల్ల ఇజ్రాయెల్‌-అరబ్‌ దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. అంతేకాదు, ఇజ్రాయెల్‌‌తో మొరాకో, బహ్రెయిన్‌ మధ్య నేరుగా విమాన సర్వీసులకు అవకాశం కల్పించింది. ఈ ఒప్పందంతోనే యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌తో ఇజ్రాయెల్ ఆర్థిక, భద్రతా సంబంధాలను బలోపేతం చేసుకుంది. కానీ, ప్రత్యేక పాలస్తీనా విషయంలో పరిష్కారం చూపకపోవడంతో పలు ముస్లిం మెజార్టీ దేశాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలను అబ్రహాం అకార్డ్స్‌లో చేరాలని ట్రంప్‌ ఒత్తిడి చేస్తున్నారు. ముందుగా సౌదీ, ఖతార్‌, తర్వాత పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్‌‌లు వారిని అనుసరించాలని సూచించారు. ఇరాన్‌ కూడా చేరితే చాలా బాగుంటుందని పేర్కొన్నారు. కానీ, ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో మెజార్టీ ముస్లిం దేశాలు ఈ ఒప్పందాల్లో చేరడం కష్టమే. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేవరకూ ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణకరీంచడం సాధ్యం కాదని సౌదీ, ఖతార్‌ వంటి దేశాలు అనేక సందర్భాల్లో స్పష్టం చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు ప్రయోజనం చేకూర్చే ఈ ఒప్పందాలకు అవి అంగీకరించకపోవచ్చు. ఇక, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌కు ట్రంప్‌ పిలుపు ఏమాత్రమూ రుచించడం లేదు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌ను పాకిస్థాన్ అధికారికంగా గుర్తించలేదు. అబ్రహాం అకార్డ్స్‌లో చేరాలని 2020లోనే అమెరికా ప్రతిపాదించగా.. నాటి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అందుకు ససేమిరా అన్నారు. షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం కూడా అదే వైఖరి ప్రదర్శిస్తోంది. ఒకవేళ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఈ ఒప్పందాల్లో చేరితే స్వదేశంలో షరీఫ్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఈ ఒప్పందాల్లో చేరడం తమకు ఇష్టం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ పునరుద్ఘాటించారు.