: భారత స్టాక్ మార్కెట్ సూచీలు మే 27 సెషన్‌లో (బుధవారం) తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఒక్కసారిగా లాభాల్లోకి వస్తూ.. మళ్లీ వెంటనే నష్టాల్లోకి జారుకుంటున్నాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ సహా కొన్ని లోహ రంగాల షేర్లు రాణిస్తున్నాయి. ఐటీ స్టాక్స్ కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో మధ్యాహ్నం 1.10 గంటలకు చూస్తే సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టంతో 75,950 స్థాయిలో ఉంది. నిఫ్టీ ఫ్లాట్‌గా 23,900 వద్ద ట్రేడవుతోంది. అయితే మార్కెట్ నష్టాల్లో నేపథ్యంలోనే మనం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది బుధవారం సెషన్‌లో భారీగా పతనమైంది. కిందటి రోజు ఎల్ఐసీ షేరు రూ. 854.90 వద్ద ముగియగా.. ఇవాళ ఆరంభంలో స్వల్ప లాభాల్లోనే ఓపెన్ అయింది. కానీ తర్వాత ఒక్కసారిగా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో చూస్తే ఒక దశలో 4 శాతానికిపైగా తగ్గి రూ. 818.85 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం కూడా 3.50 శాతం నష్టంతో రూ. 825 వద్ద ట్రేడవుతోంది. సంస్థ మార్కెట్ విలువ చూస్తే రూ. 5.22 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 980 కాగా.. కనిష్ఠ ధర రూ. 721.50 గా ఉంది. ఎల్ఐసీ షేరు బుధవారం రోజు ఒక్కసారిగా పతనం అయ్యేందుకు కారణం ఉంది. ఎల్ఐసీలో.. కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 శాతం వాటా విక్రయిస్తుందని వార్తలు వచ్చాయి. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM).. గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, బీఎన్‌పీ పారిబస్ ఎస్ఏ, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 2022 లో రూ. 21 వేల కోట్ల నిధుల సమీకరణ..చివరగా 2022 మేలో కేంద్రం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించగా.. అప్పుడు రూ. 21 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించింది. అప్పుడు ఒక్కో షేరు ధర రూ. 949 గా ఉండేది. మార్చి 31 నాటికి చూస్తే ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వ వాటా 96.5 శాతంగా ఉంది. 2022 లో ఎల్ఐసీ.. స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అవగా.. సెబీ నిబంధనల ప్రకారం కనీసం 25 శాతం వాటా పబ్లిక్ షేర్ హోల్డింగ్ రూపంలో ఉండాలి. దీనికి గడువు 2032 వరకు ఉంది. ఈ క్రమంలోనే కేంద్రం క్రమంగా వాటా విక్రయిస్తూ వస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో వాటాల్ని విక్రయిస్తున్న కేంద్రం.. కేంద్రం.. ఎల్ఐసీ ఒక్కటే కాదు గత కొంత కాలంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల్ని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఐడీబీఐ బ్యాంకు సహా తర్వాత భెల్, ఐఆర్ఎఫ్‌సీలో వాటాల్ని విక్రయించింది. . ఇప్పుడు కోల్ ఇండియాలో కూడా వాటాను విక్రయిస్తోంది. నెక్ట్స్ ఎల్ఐసీలోనే ఉంటుందని భావిస్తున్నారు.