ORR చుట్టూ మెట్రో రైలు.. హైదరాబాద్ మెట్రో మూడో ఫేజ్.. రూ.7168 కోట్లతో 39.6 కి.మీ.లు

Wait 5 sec.

శరవేగంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. మెట్రో రైలు రాకతో హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కీలక మార్పులు రాగా.. రెండో దశ మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మూడో దశ మెట్రో విస్తరణకు సంబంధించి ప్రతిపాదనలు చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ మెట్రో మూడో దశ విస్తరణ చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.ఈ మూడో దశ మెట్రో రైలు విస్తరణకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం 40 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణాలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ మెట్రోలో దాదాపుగా 6 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో అన్ని వైపుల మెట్రో రైలు కనిక్టివిటీని పెంచేందుకు ప్రణాళికలు తయారు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మార్గాన్ని రూ.7,168 కోట్ల అంచనాలతో రెండో దశ(బీ)గా ప్రతిపాదనలు చేశారు. అయితే దీన్నే హైదరాబాద్ మెట్రో మూడో దశ ప్రాజెక్టుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మూడో దశలోనే ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) మెట్రో రైలును విస్తరించాలని సర్కార్ భావిస్తోంది. రెండో దశ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆమోదం కల్పించగానే దానికి సంబంధించిన పనులను చేపట్టడంతోపాటు మూడో దశ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు, డీపీఆర్ తయారు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓఆర్ఆర్ 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే మెట్రో రెండో దశ ప్రతిపాదనలు కూడా ఓఆర్ఆర్‌కు సమీపంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ తరహాలో అన్ని ప్రాంతాను కలిపే విధంగా మెట్రో రైలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, చౌటుప్పల్, మేడ్చల్, శామీర్‌పేట్, శంషాబాద్, తుక్కుగూడ, ఘట్‌కేసర్ వంటి ప్రాంతాల నుంచి ఉద్యోగ, వ్యాపార, ఉపాధి కోసం నిత్యం వేలమంది హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ భారీగా పెరిగిపోతోంది. దీన్ని అధిగమించేందుకు మెట్రో రైలే పరిష్కారమని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే మొదటి దశలో 69 కిలోమీటర్ల మెట్రో రైలు ఉండగా.. రెండో దశలో 122.6 కిలోమీటర్లు.. ఓఆర్ఆర్ చుట్టూ మూడో దశలో 160 కిలోమీటర్లు.. భారత్ ఫ్యూచర్ సిటీ 39.6 కిలోమీటర్లు ఇలా మొత్తం 391 కిలోమీటర్ల మేర హైదరాబాద్ మెట్రో రైలును విస్తరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.