ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్‌లో ఇవాల్టితో ముగియనున్నాయి. ఆఖరి రోజు వరకూ ప్లే ఆఫ్స్ నాలుగు స్థానాలు ఖరారు కాలేదు. ఈ రోజు జరిగే మ్యాచ్‌లతో ఏ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది.. ఏ జట్టు ఇంటి దారి పడుతుంది అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న మూడు జట్లలో ఒకటి మాత్రమే నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకోగా.. మిగతావి ఇంటి దారి పట్టనున్నాయి. సండే డబుల్ హెడ్డర్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబై - రాజస్థాన్, కోల్‌కతా - ఢిల్లీ మధ్య మ్యాచ్‌లు ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేయనున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఇక నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్లు తమ ఫైనల్ మ్యాచ్‌ ఆడనున్నాయి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ కాగా.. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలతో సజీవంగా ఉంది. వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ ఇక ఇంటిదారి పట్టినట్టే. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే.. ఏ జట్టుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్లు 31 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో ముంబై 16, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 2023 నుంచి జరిగిన తొమ్మిది మ్యాచ్‌లలో ముంబై 5, రాజస్థాన్ 4 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ సీజన్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ముంబై చిత్తు చిత్తుగా ఓడిపోయింది. డబుల్ హెడ్డర్‌లో భాగంగా జరిగే రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 36 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 20, ఢిల్లీ క్యాపిటల్స్ 15 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ ఏడాది జరిగిన ఒక మ్యాచ్‌లోనూ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.