మొత్తానికి ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి ఘట్టం వచ్చేసింది. ఆఖరి రోజు వరకూ ప్లే ఆఫ్స్‌లో నాలుగో స్థానం ఖరారు కాకపోవడమే ఈ సీజన్ హైలెట్. ఐదు జట్ల నుంచి రేసులోకి మూడు జట్లే మిగిలాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేట్ కాగా.. ప్లే ఆఫ్స్ రేసులో ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్, కోల్‌కతా జట్లే మిగిలాయి. ప్లే ఆఫ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అడుగుపెట్టాయి. ఇందులో ఆర్సీబీ, గుజరాత్ క్వాలిఫైయర్ 1 ఆడనుండగా.. సన్‌రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఎప్పుడో ఎలిమినేట్ కాగా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేట్ అయ్యాయి. ఇక మిగిలింది మూడే జట్లు. ఆ మూడు జట్లలో ఒకటే నాలుగో స్థానంలో నిలవనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై గ్రాండ్ విక్టరీ తర్వాత పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో నాలుగో స్థానంలోకి వచ్చింది. అయితే, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్లడమా? ఇంటి దారి పట్టడమా? అనేది మాత్రం ఇవాళ జరిగే డబుల్ హెడ్డర్ మ్యాచ్‌ల మీద ఆధారపడి ఉంటుంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో ముంబై - రాజస్థాన్, రాత్రి కోల్‌కతా - ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాలే పంజాబ్ భవితవ్యాన్ని తేల్చనుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తే.. ఏ జట్టు మీద ఆధారపడకుండా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. రాత్రి జరిగే కోల్‌కతా - ఢిల్లీ మ్యాచ్ కూడా నామమాత్రంగానే జరుగుతుంది. దాంతో పాటు పంజాబ్ కూడా ఇంటిదారి పడుతుంది. రాజస్థాన్ ఓడిపోతే అప్పుడు ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు పంజాబ్, కోల్‌కతాకి ఉంటాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 13 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాత్రి జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా ఢిల్లీతో తలపడనుంది. ఒకవేళ రాజస్థాన్ ముంబైపై ఓడిపోతే కేకేఆర్‌కు ఛాన్స్ ఉంటుంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌కు వెళ్లనుంది. పంజాబ్ కింగ్స్ నెట్ రన్‌రేట్ +0.309 ఉండగా.. కోల్‌కతా నెట్ రన్‌రేట్ +0.011గా ఉంది. దాంతో ఈ రోజు ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారనుంది.