కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్ఎస్)లో చేరేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ విద్యుత్ మీటర్లు బిగించనున్నారు. దీనికి సంబంధించి.. శనివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్.. ఆమోద ముద్ర వేసింది. అయితే ఇందులో నుంచి రైతులను మినహాయించారు. వ్యవసాయ కనెక్షన్లు మినహా అన్ని విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం.. ట్రాన్స్‌మిషన్ నష్టాలను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్‌డీఎస్ఎస్ పథకాన్ని అమలు చేస్తోందని.. ఈ పథకం కింద వ్యవసాయ కనెక్షన్లు మినహా మిగతా అన్ని విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారని తెలిపింది. కేబినెట్ భేటీ తర్వాత మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ విషయాలను వెల్లడించారు. అయితే ఈ ఆర్‌డీఎస్ఎస్‌లో తెలంగాణ చేరడం కొత్త నిర్ణయం కాదని తేల్చి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పటికే కేంద్ర విద్యుత్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం.. ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తెలిపారు. అసెంబ్లీలో రెండు రోజుల పాటు చర్చించిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో వ్యవసాయ కనెక్షన్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లను అమలు చేసేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.ఇక.. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు వినియోగదారులపై పడదని అధికారులు వెల్లడించారు. వీటికి అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయని తెలిపారు. డిస్కంల ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలోనే ఉంటుందని అధికారులు తేల్చి చెప్పారు.