ఇది కదా కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే.. పంజాబ్ కోసం ప్రాణాలు పెట్టిన సర్పంచ్ సాబ్!

Wait 5 sec.

పంజాబ్ కింగ్స్‌ని ఐపీఎల్‌లో ఓ రేంజ్‌లో నిలబెట్టింది శ్రేయాస్ అయ్యర్. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ట్రోఫీ అందించిన శ్రేయాస్ అయ్యర్‌ను కేకేఆర్ వెంటనే రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారీ ధరకు దక్కించుకుంది. అదే ఏడాది పంజాబ్‌ను ఫైనల్ వరకూ చేర్చి సర్పంచ్ సాబ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2026లోనూ పంజాబ్ కింగ్స్ తొలి ఏడు మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న పంజాబ్ ఆ తర్వాత వరుసగా ఆరు ఓడి.. లక్నోపై చావో రేవో మ్యాచ్‌కి సిద్ధమైంది. ఆ మ్యాచ్‌లో ఓడిపోతే పంజాబ్ ఇంటిదారి పట్టడం ఖాయమనుకున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ప్రాణాలు పెట్టి మరీ గెలిపించుకున్నాడు. లక్నో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మూడో ఓవర్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తొలుత ఇన్నింగ్స్‌ని నిలబెట్టి, మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో కలిసి లక్నో బౌలర్లను చెడుగుడు ఆడాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఎప్పుడైతే అవుటయ్యాడో అప్పటి నుంచి సిక్సర్ల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఆడిన శ్రేయాస్ అయ్యర్ 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విన్నింగ్ షాట్‌ని సిక్సర్‌గా మలిచిన అయ్యర్ సెంచరీతో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. జట్టును గెలిపించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిపాడు. శ్రేయాస్ అయ్యర్ సూపర్ క్లాస్ సెంచరీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించిన ఈ రెండేళ్లలో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఐదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న అయ్యర్.. ఈ ఏడాది లక్నో సూపర్ జెయింట్స్‌పై సీజన్ చివరి మ్యాచ్‌లో అవార్డు తీసుకున్నాడు. మొత్తం 14 మ్యాచ్‌లలో 13 ఇన్నింగ్స్‌లు ఆడిన శ్రేయాస్ అయ్యర్ 498 పరుగులు చేశాడు.