తిరుమల శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే దాదాపు లక్ష మంది దర్శనాలు

Wait 5 sec.

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల కొండకు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం.. నిత్యం లక్ష మందికి పైగా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 94,758 మందికి స్వామివారి దర్శనం జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. అయితే సాధారణంగా శుక్రవారం రోజున స్వామి వారికి పూజా కైంకర్యాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో భక్తులకు స్వామివారు దర్శనం ఇచ్చే సమయం తక్కువగా ఉంటుంది. అయినప్పటికి కూడా శుక్రవారం రోజున అత్యధిక మంది దర్శించుకోవడం గమనార్హం. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. టీటీడీ అధికారులు.. శుక్రవారం రోజున ఉదయం నిర్వహించే శ్రీవారి అభిషేక సేవ సమయంలో కూడా సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. అభిషేకం సమయంలో క్యూలైన్ నిలిపివేయకపోవడంతో.. అదనంగా మరో 5850 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. దీంతో శుక్రవారం రోజున మొత్తంగా సర్వదర్శనానికి 17 గంటలకుపైగా సమయాన్ని అధికారులు కేటాయించారు. భక్తుల రద్దీ అధికం కావడంతో.. క్యూలైన్లలోకి రావద్దు అంటూ తిరుమల కొండపై అధికారులు కాస్త భక్తులను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనం ద్వారా 24 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు టీటీడీ అధికారులు.. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. నడక మార్గాల ద్వారా కొండకు చేరుకునేవారితోపాటు.. బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ద్వారా ఘాట్ రోడ్డుల్లో వస్తున్న వారిని.. కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను ఎప్పటికప్పుడు అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అంచనా వేస్తున్నారు. ఇక ఈ మే నెలలో ఒక్కరోజులో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90 వేలు దాటడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఎండా కాలం సెలవుల నేపథ్యంలో.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నప్పటికీ.. తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడం విశేషం.