: భారత్‌కు చెందిన దిగ్గజం టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో పెద్ద స్కెచ్ వేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా కోరుకునే వారి కోసం సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తాజాగా జియో ఓటీటీ పాస్‌ను లాంఛ్ చేసింది. ఇక్కడ రూ. 200 పాస్‌తోనే ఏకంగా 15 ప్రీమియం ఓటీటీ యాప్స్, ఇంకా జియో టీవీలో 1000 కిపైగా ఛానెల్స్ వస్తాయి. ఇంకా 30 GB హైస్పీడ్ డేటాతో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇక వ్యాలిడిటీ 28 రోజులుగా జియో నిర్ణయించింది. ఈ ప్లాన్ మే 27 అంటే నేటి నుంచే అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. ఇక దాదాపు రూ. 1500 విలువైన ప్రయోజనాల్ని కేవలం రూ. 200 కే అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్యాక్ ద్వారా కస్టమర్లు.. టీవీ, మొబైల్ పరికరాలు, టాబ్లెట్‌లో ఎలాంటి ప్రకటనలు (యాడ్స్) లేకుండానే, బ్యాక్ గ్రౌండ్‌ప్లే చేస్తూ యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్ చేయొచ్చు. దీనితో పాటుగా హాట్‌స్టార్ ఒరిజినల్స్, లైవ్ స్పోర్ట్స్, బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ కంటెంట్‌ చూసేందుకు వీలుగా జియోహాట్‌స్టార్ మొబైల్ ప్లస్ హాలీవుడ్ యాక్సెస్ అందిస్తోంది. ఈ ప్యాక్‌లో అదనంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ యాక్సెస్ కూడా ఉంది. జియో టీవీ ద్వారా ఈ ప్లాన్ కింద సోనీ లివ్, Zee5, లయన్స్‌గేట్‌ ప్లే, సన్ నెక్ట్స్, డిస్కవరీ ప్లస్,హోయ్‌చోయ్, చౌపల్, ఫ్యాన్‌కోడ్, టైమ్స్ ప్లే, ప్లానెట్ మరాఠీ, తరంగ్ ప్లస్ వంటి మరో 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. జియో టీవీ ద్వారానే సబ్‌స్క్రైబర్లు సుమారు 1000 కిపైగా లైవ్ టీవీ ఛానెల్స్ చూడొచ్చు. దీంట్లో ప్రముఖ బ్రాడ్‌కాస్టర్లకు చెందినటువంటి 150 కిపైగా పెయిడ్ ఛానెల్స్ ఉన్నాయి. సన్ టీవీ నెట్‌వర్క్, డిస్కవరీ, వార్నర్ బ్రదర్స్, ఈటీవీ, జియో స్టార్‌కు చెందిన ప్రాంతీయ ఎంటర్‌టైన్మెంట్, సినిమా ఛానెళ్లు కూడా వీక్షించే వీలుంటుంది. ఇంకా యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న వారు ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే 30 GB 4G లేదా 5G డేటా సహా అన్‌లిమిటెడ్ ట్రూ 5G డేటా కూడా వినియోగించుకోవచ్చు. జియో.కామ్ వెబ్‌సైట్, థర్డ్ పార్టీ రీఛార్జి యాప్, మైజియో యాప్‌లలో ఈ ప్లాన్ అన్ని టెలికాం సర్కిల్స్‌లో అందుబాటులో ఉంటుందని జియో ఒక ప్రకటనలో తెలిపింది. దాంట్లోకి వెళ్లి నేరుగా రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొంది.