ఆ సీరియల్ తీసి నష్టపోయా.. అసలు ఒక సీరియల్ తీయాలంటే ఖర్చు ఎంతా? తిరిగి ఎంత వస్తుందంటే: నిరుపమ్ పరిటాల

Wait 5 sec.

నిరుపమ్ పరిటాల అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. డాక్టర్ బాబు, కార్తీక్ బాబు అనే సౌండ్ వినిపించిందంటే.. హో మా వాడే.. మా ఇంట్లో వాడే అన్నట్టుగా ఓన్ చేసుకుంటారు మన తెలుగు ప్రేక్షకులు. రాత్రి 7.30 అయ్యిందంటే చాలు.. టీవీ రిమోట్‌లు మన ఆడాళ్ల చేతుల్లోకి సరెండర్ చేయాల్సిందే. లేదంటే పెద్ద యుద్ధాలు తప్పవంటే.. ఇదిగో ఈ మాయలోడు కార్తీక్ బాబు కోసమే. నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా.. బాధపెట్టాలన్నా.. ఆనందపెట్టాలన్నా.. కార్తీక్ బాబు తరువాతే ఎవరైనా. అందుకే అతని నటనకోసం టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా బుల్లితెరపై సత్తా చాటుతున్న నిరుపమ్ పరిటాల.. ‘పొదరిల్లు’ సీరియల్‌కి నిర్మాతగానూ ఉన్నారు. అటు కార్తీకదీపం 2, ఇటు పొదరిల్లు ఈ రెండు సీరియల్స్ టాప్‌ రేటింగ్‌తో సూపర్ సక్సెస్‌గా దూసుకునిపోతున్నాయి. అయితే సీరియల్స్ అంటే అంత ఈజీ కాదంటూ.. అసలు ఒక్క సీరియల్ తీస్తే ఎంత ఖర్చు అవుతుంది. అక్కడ ఎలాంటి ఒడుదుడుగులు ఉంటాయో చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను టీవీకే పరిమితం కావడానికి కారణం ఏంటంటే.. అది నా నేచర్ ఏమో. నేను దూకుడుగా వెళ్లి.. మనుషులతో పరిచయాలు పెంచుకుని కలుపుగోలు తనంతో ఉండలేకపోవడం అనేది ఇండస్ట్రీలో డిస్ అడ్వాంటేజే. అది తప్పితే వేరే రీజన్ లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ అంటే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా పరిచయాలు ఉండాలి. అందర్నీ కలవాలి. వాళ్ల కళ్ల ముందు తిరుగుతుంటే.. హో వీడూ ఒకడున్నాడని అనుకుంటారు. తొందరగా నోటీస్ అవుతాం. నేను ‘చంద్రముఖి’ సీరియల్స్ చేస్తున్నప్పుడు సినిమాల్లో ఆడిషన్స్ ఇవ్వడానికి నాకేం ఇబ్బంది లేదు. కానీ నాతో పాటు కొత్త వాళ్లు కూడా వస్తుంటారు. అప్పుడు వాళ్లు నన్ను ఎలా చూస్తారంటే.. ఆల్రెడీ మీరు ఆర్టిస్ట్‌ కదా.. మీరు కూడా వచ్చారేంటి? అని చిన్నచూపు చూస్తారని అనిపించేది. అలాంటి డెలికేట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. మనకి బాగా తెలిసి ఉండి.. చనువు ఉంటే తప్ప నేను వెళ్లను. చాలామంది టీవీ నే కదా.. ప్రొడ్యూస్ చేసేయొచ్చు కదా అని అనుకుంటారు. కానీ ఈరోజుల్లో ఒక సీరియల్ స్టార్ట్ చేయాలంటే.. రూ.80 లక్షల నుంచి కోటి రూపాయిల వరకూ ఖర్చు అవుతుంది. ఆ డబ్బు మళ్లీ తిరిగి రావాలంటే.. ఈజీగా ఏడాదిన్నర నుంచి రెండేళ్లు టైమ్ పడుతుంది. అప్పటికి తీసుకొచ్చిన దానికి వడ్డీలు కడుతుంటాడు. మన కర్మకాలి.. ఆ సీరియల్ క్లిక్ కాకపోయినా రేటింగ్ రాక ఆ ప్రాజెక్ట్ మధ్యలో క్లోజ్ చేశారంటే.. అయిపోయినట్టే. నాకు అలాంటి సందర్భం వచ్చింది. ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సీరియల్ తీశాను. అది మధ్యలోనే ఆపేశాం. దాదాపు 200 ఎపిసోడ్‌ల దగ్గరలో ఆపేశాం. టీఆర్పీ రావడం లేదంటే సీరియల్ ఆపేయమని ఛానల్ వాళ్లు మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా బిజినెస్ అంతే. బిజినెస్ దగ్గర మొహమాటాలు చూడరు. వీడు మనోడే.. మనతోనే ఉన్నాడు.. అలాంటివేం చూడరు. నష్టం వస్తుందంటే క్లోజ్ అంటారంతే. అల్టిమేట్‌గా ఇది బిజినెస్. అది లేదంటే మూసేసుకోవాల్సిందే. నేను ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో నేనూ హీరోగా చేయొచ్చు. కానీ.. ప్రైమ్ టైమ్‌లో వచ్చే సీరియల్స్‌లో సేమ్ హీరో ఉంటే బాగోదు. కార్తీకదీపం సీరియల్‌లో హీరోగా చేస్తున్నా.. పొదరిల్లు సీరియల్‌కి నిర్మాతని. సాధారణంగా ఒక సీరియల్‌కి నెలలో 12 రోజులు పని చేయాల్సి వస్తుంది. 12 రోజుల్లో 30 ఎపిసోడ్స్ చేస్తేనే సేఫ్‌లో ఉంటాం. లేదంటే.. మైనస్‌లోకి వెళ్లిపోతాం. వాళ్లు ఇచ్చే బడ్జెట్‌కి లోబడి చేయాలి. కాదని ఎక్కువ రోజులు షూట్ చేస్తే.. ఖర్చులు ఎక్కువ అయిపోతాయి. ఎపిసోడ్‌కి వచ్చి వాళ్లు ఇచ్చే బడ్జెట్‌ని బట్టి ఖర్చులు ఉంటాయి. సీరియల్స్‌లో రోజుకొచ్చి 40-50 మంది పనిచేస్తుంటారు. వాళ్లకి భోజనాలు, టిఫిన్లు, మేకప్ రూమ్స్ ఇలా చాలా ఉంటాయి. ప్రొడక్షన్ కాస్ట్ అంటే సినిమాకి సీరియల్‌కి పెద్ద తేడా ఏం ఉండదు’ అంటూ చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల.