మమత, స్టాలిన్ ఓటమిపై వైఎస్ జగన్ విశ్లేషణ.. రెండూ డేంజరేనంటూ కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

SIR.. (Special Intensive Revision) పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం.. తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికలకు ముందు నుంచి ఆమె ఇదే మాట చెప్తూ వచ్చారు. అలాగే కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరం చెప్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే వైసీపీ అధినేత మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అవగాహన పెంచుకోవాలని.. ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తగా , అప్రమత్తంగా ఉండాలంటూ పదేపదే చెప్తున్నారు. ఇదే విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి సైతం పార్టీ నేతలకు పలుసార్లు అవగాహన కల్పించారు.తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ ముఖ్యనేతలు, సమన్వయకర్తలు, ఇంఛార్జిలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్ అంశం గురించి ప్రధానంగా చర్చించారు. కన్నబాబుతో మరోసారి నేతలకు దీనిపై అవగాహన కల్పించారు జగన్. మరింత ప్రాక్టికల్‌గా ఉండేందుకు తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలను ఉదహరించారు. ఆయా రాష్ట్రాలలో స్టాలిన్, మమతా బెనర్జీ ఓడిపోయిన విషయాన్ని, దాని వెనుక ఉన్న కారణాలను సైతం జగన్ విశ్లేషించారు. "ఎస్ఐఆర్ సర్వే ద్వారా పశ్చిమ బెంగాల్‌లో 91 లక్షల ఓట్లు అంటే 11.9 శాతం ఓట్లు తీసేశారు. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తొలగించారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో 45982 ఓట్లు తొలగిస్తే.. 15 వేల ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓడిపోయారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొళత్తూర్ నియోజకవర్గంలో 71 వేల ఓట్లు తొలగిస్తే.. స్టాలిన్ 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ రెండు అంశాలను అందరూ గుర్తుపెట్టుకోండి. బెంగాల్‌లో 91 లక్షల ఓట్లు తొలగిస్తే.. మమతా బెనర్జీ పార్టీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే.. స్టాలిన్ పార్టీ ఓడిపోయింది 17 లక్షల ఓట్ల తేడాతో.. మీరంతా మీ నియోజకవర్గాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏపీలో ఓట్లు పెరగటం వలన మనం ఓడిపోయాం. అక్కడేమో ఓట్లు తీసేయడం వలన వాళ్లు ఓడిపోయారు.. రెండూ డేంజరే.." అని జగన్ వైసీపీ నేతలకు సూచించారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, అలాగే బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. తమిళనాడులో టీవీకే, బెంగాల్‌లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేశాయి.