అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు మరో భారీ తిమింగలం చిక్కింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ ఎమ్మార్వో ఆఫీసులో అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ.. ఎమ్మార్వో సుచరిత ఆఫీసులో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో బాధితుడి నుంచి ఆమె కారు డ్రైవర్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని, వాటిని సుచరితకు అందిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన దాదాపు రూ. 30 లక్షల భారీ లావాదేవీలకు సంబంధించిన కేసులో ఈ దాడులు నిర్వహించారు. ఎమ్మార్వో సుచరితతో పాటు ఆమె కారు డ్రైవర్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ దాడులు నిరర్వహించారు. సోదాల అనంతరం మీడియా సమావేశంలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరాలను వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టామని, ఎకరానికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ సుచరిత.. డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నామని అన్నారు. ఎమ్మార్వో ఆఫీసులో కీలక పత్రాలు, భూకన్వర్షన్‌కు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీటి పరిశీలించి, ఎమ్మార్వో సుచరిత, ఆర్డీఓ కీసర రాజేష్ సహా పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, రెండేళ్ల కిందట కూడా శామీర్‌పేట ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్‌తో కలిసి ఏసీబీకి పట్టుబడిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.