తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు బండి భగీరథ్‌ను పోలీసుల కస్టడీకి మేడ్కల్ మల్కాజిగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు భగీరథ్‌ను మూడు రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఈ కేసులో లోతుగా విచారణ జరపడం నిందుతుణ్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరిచింది... మే 26వ తేదీకి విచారణను వాయిదా వేసింది. నాలుగు రోజుల క్రితం తెలిపినట్లుగానే కస్టడీ పిటిషన్‌ను నేడు విచారించిన కోర్టు.. పోలీసులకు అనుకూలంగా తీర్పునిచ్చింది.మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ సారథ్యంలో ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పటికే బాధితురాలితోపాటు ఆమె తల్లితో మాట్లాడి.. వారి దగ్గర్నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. బండి భగీరథ్ స్నేహితులను సైతం సిట్ విచారించింది.పోక్సో కేసు నమోదు కావడంతో నిందితుడు బండి భగీరథ్ చాలా రోజులపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు బలగాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలోనూ గాలించాయి. కానీ ఫలితం లేకపోయింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకోవాలని తెలంగాణ పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేసు పూర్వాపరాలు..2025 జూన్‌లో బాధిత బాలికకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా భగీరథ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు స్నేహంగా మెలిగారు. ఆ ఏడాది అక్టోబర్ - డిసెంబర్ నెలల మధ్య భగీరథ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మద్యం సేవించాలని ఒత్తిడి తీసుకొచ్చాడని బాధితురాలు ఆరోపించింది. ఈ ఏడాది జనవరిలో ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది. దీంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె తల్లి పేర్కొంది. బాధితురాలి కుటుంబం చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో.. రాజీ ప్రయత్నాలు జరిగాయి. నిందుతుడి తండ్రి తన రాజకీయ పలుకుబడిని గురించి హెచ్చరించినట్లు బాధితురాలి తల్లి ఆరోపించింది.మే 8న కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్లో భగీరథ్ తరఫున కేసు నమోదైంది. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మరుసటి రోజు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అనంతరం ముందస్తు బెయిల్ కోసం నిందితుడు ప్రయత్నించారు. బాధితురాలు మైనర్ కాదని భగీరథ్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. కానీ బెయిల ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో మే 16న నార్సింగి పోలీసు స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు. మే 21న నిందితుడు ముందస్తు బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన హైకోర్టు, సాధారణ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.