అమెరికా విదేశాంగ మంత్రి భారత పర్యటన ముగిసింది. మే 23న కోల్‌కతాలో అడుగుపెట్టిన ఆయన.. తర్వాత ఢిల్లీ చేరుకొని ప్రధాని మోదీని, విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులను కలిశారు. తర్వాత ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ ముందు తన భార్యతో కలిసి ఫొటోలు దిగిన రూబియో.. అనంతరం జైపూర్‌లోని అంబర్ కోటను సందర్శించారు.అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇప్పటి వరకూ ఆయన అడ్మినిస్ట్రేషన్ నుంచి భారత్‌లో పర్యటించిన అత్యున్నత దౌత్యవేత్త రూబియోనే. భారత్, అమెరికా మధ్య వాణిజ్య సుంకాల విషయంలో తలెత్తిన విబేధాలను సరిదిద్ది.. ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించే లక్ష్యంతో ఆయన భారత పర్యటన సాగింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని కూడా రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు.తన పర్యటనలో భాగంగా కోల్‌కతా, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్‌లను సందర్శించిన రూబియో.. మంగళవారం జైపూర్ నుంచి తిరిగి ఢిల్లీ వచ్చి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చైనా దూకుడును అడ్డుకోవడం, పశ్చిమాసియా సంక్షోభం తదితర విషయాలను చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆయన అమెరికాకు తిరిగి వెళ్లారు.మార్కో రూబియో జైపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆంబర్ కోట వద్ద రాజస్థాన్ డిప్యూటీ సీఎం, పర్యాటక శాఖ మంత్రి దియా కుమారి ఆయనకు సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం పలికారు. భారత్‌కు వచ్చిన రూబియో.. ఆగ్రా, జైపూర్ నగరాల్లోని చారిత్రక ప్రదేశాలను సందర్శించారు.జైపూర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు అధికారులు వీడ్కోలు పలుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సీఐ, ఎస్సై, కానిస్టేబుల్, కొందరు కింది స్థాయి అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారని.. కనీసం సహాయ మంత్రులు కూడా ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనలేదంటూ పీటీఐ వీడియోను వైరల్ చేస్తున్నారు.అయితే మార్కో రూబియో జైపూర్ పర్యటన కేవలం చారిత్రక కట్టడాలను సందర్శించడం కోసమే. ఇది అధికారిక పర్యటన కాదు. దీంతో దౌత్య నిబంధనల ప్రకారం ఓ విదేశీ ప్రతినిధి మన దేశంలోని నగరాలకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రులు ఆ పర్యటనకు హాజరు కావాల్సిన అవసరం లేదు. అలాగే స్థానిక రాష్ట్ర ప్రతినిధులు, విదేశాంగ శాఖకు చెందిన అధికారులు ప్రోటోకాల్ ప్రకారం వీడ్కోలు పలికితే సరిపోతుందని అంతర్జాతీయ నింబంధనలు చెబుతున్నాయి.అమెరికా విదేశాంగ మంత్రికి జైపూర్ విమానాశ్రయంలో కింది స్థాయి అధికారులు వీడ్కోలు పలికారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. రాజస్థాన్ ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్ విభాగం అధికారులు, ఆలిండియా స్థాయి అధికారులు ఆయనకు ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికారు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తిగా అంతర్జాతీయ దౌత్య ప్రోటోకాల్ ప్రకారమే ఆయనకు వీడ్కోలు పలికారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో మంత్రి స్థాయి నేతలెవరూ రూబియో వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్ యంత్రాగానికి భారత్ ఇచ్చిన గట్టిన సందేశంగా దీన్ని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.