నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అతి త్వరలోనే 6 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లను రిలీజ్ చేసేందుకు టీజీపీఎస్సీ అధికారులు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్రంలో శాఖల వారీగీ వివరాలను సేకరించిన టీజీపీఎస్సీ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనుంది. టీజీపీఎస్సీ కార్యదర్శికి ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 6 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని ఇటీవలె రేవంత్ రెడ్డి సర్కార్ పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 10 ఏళ్లు పెంచి.. 44 ఏళ్లుగా చేసింది. అయితే ఈ 6 వేలకుపైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో అత్యధికంగా టీచింగ్ పోస్టులే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వెయ్యికిపైగా అధ్యాపక పోస్టులుఉండగా.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 300కి పైగా టీచర్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఇక పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు (డైట్ కాలేజీల్లో) 100కి పైగా అధ్యాపక పోస్టులు.. జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇవే కాకుండా దేవాదాయ శాఖ, అటవీ శాఖ, సర్వే సెటిల్‌మెంట్, ఆర్టీసీ, పురపాలక శాఖల్లో కూడా పలు పోస్టులు ఖాళీలు ఉన్నాయని టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు.. ఇప్పటికే టీజీపీఎస్సీకీ ఆర్టీసీ ఎండీ లేఖ రాశారు. అదే సమయంలో పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కూడా భారీ మొత్తంలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని.. త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.మరోవైపు.. ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఇప్పటి నుంచి ఒక కొత్త విధానాన్ని పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే తేదీ, ఒకే సమయంలో 2 పరీక్షల షెడ్యూల్ ఉండటం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కమిషన్ జాగ్రత్తలు చేపడుతోంది. రాష్ట్రస్థాయి పరీక్షలతోపాటు.. యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ వంటి నేషనల్ లెవల్ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను తయారు చేయనున్నారు.ఇదే కాకుండా ఒకేసారి అన్ని శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయకుండా ప్రతీ 2 వారాలకు ఒకసారి ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం వల్ల నిరుద్యోగులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇక ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఖాళీల భర్తీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో త్వరలోనే వరుస నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టుల భర్తీ కోసం వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ నోటిఫికేషన్లకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకోవాలని తేల్చి చెప్పారు.