హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తీవ్ర తోపులాట, ఘర్షణ, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ అల్‌ హజ్రీ ఒకరిపై మరొకరు దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్‌ల ముందే ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ ఒకరిపై మరొకరు.. ఘర్షణకు దిగారు. అయితే అజారుద్దీన్ పక్కన ఎవరు కూర్చోవాలి అనే అంశంలో ప్రొటోకాల్ వివాదం కారణంగానే ఈ ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది.మొదట ఉస్మాన్‌ అల్‌ హజ్రీ.. ఫిరోజ్‌ఖాన్‌‌ చెంపపై కొట్టి తోసేయడంతో ఒక్కసారిగా ఆయన కిందపడ్డారు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు రంగంలోకి సీనియర్ నేత వీ హనుమంతరావు రావడంతో.. ఆయనను కూడా తోసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు వారిద్దరినీ అడ్డుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో గొడవ సద్దుమణిగింది. అయితే సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణతో దాన్ని కొనసాగించకుండానే మంత్రి అజారుద్దీన్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.మరోవైపు.. చెంపపై ఉస్మాన్ హజ్రీ కొట్టడం, వెంటనే ఫిరోజ్ ఖాన్ పడిపోవడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజా వివాదంపై ఫిరోజ్ ఖాన్ రియాక్ట్ అయ్యారు. కుర్చీలో కూర్చునే విషయంలో ఇబ్బంది జరిగినట్లు వెల్లడించారు. చిన్న విషయం వల్ల గొడవ మొదలైనట్లు చెప్పారు. ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటి వారని పేర్కొన్నారు. స్టేజీ మీదకి రమ్మని ఉస్మాన్ పిలిస్తే తాను వెళ్లలేదని తెలిపారు. అయితే ఉస్మాన్ తనకు ముద్దు కూడా పెట్టారని ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు. జరిగిన గొడవ అంతా తమ ఫ్యామిలీ విషయమని ఫిరోజ్ ఖాన్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.ఇక.. ఫిరోజ్ ఖాన్‌తో జరిగిన గొడవ గురించి ఉస్మాన్‌ అల్‌ హజ్రీ కూడా స్పందించారు. ఈ ఘటన తర్వాత ఫిరోజ్ ఖాన్‌కు తాను క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ అని తేల్చేశారు. తమది కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ అని పేర్కొన్న ఉస్మాన్ హజ్రీ.. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. అయితే తాను తోసిన వీడియోలు మాత్రమే బయటికి వచ్చాయని.. కానీ అంతకుముందు ఏం జరిగిందో అది బయటికి రాలేదని ఉస్మాన్ హజ్రీ తెలిపారు.ఈ వివాదంపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. కాంగ్రెస్ నేతల మధ్య చిన్న అపార్థం కారణంగా గొడవ తలెత్తిందని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం లాగా ఎలాంటి పెద్ద ఘటన జరగలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అంతర్గత విషయాలను వక్రీకరించడం సరైన పద్దతి కాదని తెలిపారు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజ్రీ.. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న నాయకులని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడే పార్టీ అని.. అనవసరంగా దీనిపై రాద్ధాంతం చేయొద్దని హితవు పలికారు. ఇక ఈ గొడవ జరిగిన వెంటనే వారిద్దరూ మాట్లాడుకుని, హగ్ చేసుకుని కలిసిపోయారని మంత్రి వివరించారు.