Vijay Delhi Tour: ప్రధానితో 20 నిమిషాలు సమావేశం.. మోదీకి విజయ్ రెండు రిక్వెస్ట్‌లు

Wait 5 sec.

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జోసెఫ్ విజయ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించిన విజయ్.., వాటిని పరిశీలించాల్సిందిగా ప్రధానమంత్రిని కోరారు. ఇటీవల హాలెండ్ నుంచి పురాతన రాగి ఫలకాలను తిరిగి తీసుకొచ్చినందుకు మోదీకి విజయ్ ధన్యవాదాలు తెలిపారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మేకెదాటు డ్యామ్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తమ రాష్ట్రంలోని దిగువ ప్రాంతాలలో నీటి లభ్యతపై ప్రభావం పడుతుందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే, ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ప్లే చేయడానికి అనుమతించాలని మోదీని అభ్యర్థించారు. జాతీయ గీతం, జాతీయ గేయం రెండింటినీ కలిపి ప్లే చేయాల్సి వచ్చినప్పుడు, వందేమాతరంలోని ఆరు చరణాలను ముందుగా పాడాలని కేంద్ర హోం శాఖ ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఈ అభ్యర్థన చేయడం గమనార్హం. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందు వందేమాతరం, జనగణమన చివరిగా తమిళ్ తాయ్ వాళుత్తు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.మేకెదాటు వివాదంపై రెండు రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలో కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా ఆనకట్ట నిర్మించే ఏ ప్రయత్నమైనా కావేరీ జల ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధమని ప్రధానితో విజయ్ అన్నారు. అటువంటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం కాబట్టి, ఆనకట్ట నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని జలశక్తి మంత్రిత్వ శాఖను ఆదేశించాలని విజయ్ మోదీని కోరారు.మేకెదాటు ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన డీపీఆర్‌ను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి, ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని కర్ణాటక డిప్యూటీ సీఎండీకే శివకుమార్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే హక్కు తమిళనాడుకు లేదని కూడా శివకుమార్ అన్నట్లు సమాచారం. కావేరీ జలాలపై తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. మేకెదాటు మరో వివాదానికి కేంద్రంగా మారే అవకాశం ఉంది.రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) వైమానిక వ్యవస్థల కేంద్రాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కూడా ప్రధాని మోదీకి విజయ్ మరో అభ్యర్థన చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. సాధారణ మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.