SGB: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఏడాది కాలంలోనే తులం బంగారం రెండింతలైంది. దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి భారీ రిటర్న్స్ లభిస్తున్నాయి. చాలా మంది భౌతికంగా బంగారం కొనుగోలు చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేస్తోన్న సావెరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారికీ మంచి రిటర్న్స్ వస్తున్నాయి. మే 25, 2021న జారీ చేసిన ధరలను ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర బ్యాంక్ ఓ ప్రకటన చేసింది. ఇన్వెస్టర్లు మే 25, 2026 నుంచి ఈ బాండ్లను ప్రీమెచ్యూర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే సార్వభౌమ పసిడి బాండ్ల మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో ప్రీమెచ్యూర్ రిడంప్షన్ చేసుకునేందుకు ఆర్‌బీఐ అవకాశం కల్పిస్తుంది. బంగారం ధర పెరగడంతో వచ్చే లాభాలతో పాటు ఈ బాండ్లపై ఆర్‌బీఐ ప్రతి సంవత్సరం 2.5 శాతం మేర వడ్డీ చెల్లిస్తుంది. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ పబ్లిష్ చేసిన 999 ప్యూరిటీ గల బంగారం ధరలు చివరి మూడు సెషన్ల సగటు తీసుకుని ఈ ప్రీమెచ్యూర్ రిడంప్షన్ ధరను నిర్ణయిస్తారు. 1 గ్రాముకు రూ. 11,113 లాభం ధరలను నిర్ణయించేందుకు మే 20, మే 21, మే 22 తేదీల్లోని బంగారం ధరల సగటును లెక్కలోకి తీసుకుని 1 గ్రాముకు రూ. 15,840 గా నిర్ణయించింది. అలాగే ఎస్‌జీబీ 2021- 22 సిరీస్ 1 ఇష్యూ ధర ఆన్‌లైన్లో కొనుగోలు చేసిన వారికి గ్రాముకు రూ. 4727గా ఉంది. అంటే 5 ఏళ్లలో పెరిగిన ధర చూసుకుంటే రూ. 15,840- రూ. 4,727 = రూ. 11,113 గా అవుతుంది. దీని ప్రకారం ఇన్వెస్టర్లకు ఏకంగా 235 శాతం మేర లాభం వచ్చింది. పెట్టుబడి 3.35 రెట్లు పెరిగింది. 2021లో రూ. 1 లక్ష పెట్టి ఈబాండ్లు కొన్నవారు ఇప్పుడు ప్రీమెచ్యూర్ రిడంప్షన్ చేసుకుంటే వారికి రూ. 3.35 లక్షలు అందుతాయి.