సర్పంచ్ సాబ్.. సూపర్ సెంచరీతో ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఓటముల పరంపరకు బ్రేక్ పడింది. వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడిన పంజాబ్.. ఏడో మ్యాచ్‌లో లక్నోపై విజయం సాధించి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ గెలుపుతో తన ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. 15 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది.ఇకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సూపర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో సెంచరీ చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా ఆకట్టుకున్నాడు. ఆరంభంలో వికెట్లు తీసిన లక్నో.. ఆ తర్వాత విఫలమవ్వడమే పంజాబ్ విజయానికి ప్రధాన కారణం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుని, లక్నోని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఓపెనర్ కులకర్ణి, ఫస్ట్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ విఫలమైనా ఓపెనర్ జోస్ ఇంగ్లిస్, ఆయుష్ బదోనీ రాణించడం.. ఆఖర్లో అబ్దుల్ సమద్ హిట్టింగ్ చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో అందించిన 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ తొలి బంతికే ఓపెనర్ ప్రియాన్షు ఆర్య వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూపర్ కాన్‌లీ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ రెండు వికెట్లను మొహమ్మద్ షమీనే పడగొట్టాడు. దాంతో పంజాబ్ 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుండి నడిపించాడు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరూ మూడో ఓవర్ నుంచి 15వ ఓవర్ వరకూ వికెట్ పడకుండా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ - శ్రేయాస్ అయ్యర్ 76 బంతుల్లో 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 39 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ కావడంతో ఈ భాగస్వామ్యం బ్రేక్ అయింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొహమ్మద్ షమీ వేసిన ఓ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత సెంచరీకి దగ్గరైన శ్రేయాస్ అయ్యర్ సిక్సర్‌తో మ్యాచ్‌ని ఫినిష్ చేయడమే కాకుండా సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 51 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 18 ఓవర్లలోనే 200 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.