తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారు. దాదాపు 60 ఏళ్లుగా అధికారం పంచుకుంటోన్న ద్రావిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంలను తిరస్కరించారు. దళపతి విజయ్ నాయకత్వంలోని కొత్త పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను ఆదరించారు. దీంతో ప్రజాభిష్టానికి అనుగుణంగా పాలనలో విజయ్ ఎటువంటి మార్పు తీసుకొస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాట వేళ్లూనుకుపోయిన అవినీతిపై యుద్ధం ప్రకటించడం దృష్టిని ఆకర్షిస్తోంది. లంచం అడిగే ఫిర్యాదులకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన విజయ్..ఈ ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేయడం వంటివి సాధారణ రాజకీయ ప్రకటనల్లా కనిపించడం లేదు. ఇవన్నీ వ్యవస్థ సమూలంగా మార్చాలనే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీవీకే ప్రధాన కార్యదర్శి, ప్రజా పనుల శాఖా మాట్లాడుతూ..రాష్ట్రంలో రెండు నెలల్లో మార్పు చూపుతామని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్ర గీతం తమిళ్‌తాయ్‌ వాళ్తు వివాదం గురించి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే గవర్నర్‌తో విజయ్ 5 నిమిషాలు మాట్లాడారని అన్నారు. అంతేకాదు, తమ పార్టీ పేరే తమిళగ వెట్రి కళగం (టీవీకే) అని, తమిళానికే తమ తొలి ప్రాధాన్యత అని అర్జున పునరుద్ఘాటించారు. మొదటి వందేమాతరం పాడాలని సర్క్యులర్‌ వచ్చిందని గవర్నర్‌ తెలిపారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తమ క్యాబినెట్ కూర్పు ఉందని చెప్పారు. సామాజిక సమీకరణాలు, సమతూకం పాటించారని ప్రజలు కొనియాడుతున్నారని అన్నారు. అంతేకాదు, వివిధ విభాగాల్లో 35 శాతం వరకు వసూలు చేసిన పార్టీ నిధుల కమిషన్ వ్యవస్థను రద్దు చేశామని పేర్కొన్నారు. ఇకపై పనులు చేయకుండా చేసినట్టు... పూడిక తీయకుండా తీసినట్లు బిల్లులు పెడతామంటే కుదరదని అర్జున తెలిపారు. బినామీ బిల్లుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు. ఏడు రోజుల్లో రాష్ట్రంలోని అవినీతి నిర్మూలన అయిందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలోని చివరి నెలలో ఆమోదించిన అన్ని ప్రధాన ప్రజా పనులు, రహదారుల టెండర్లపై సమగ్ర సమీక్ష చేపట్టామని, ముఖ్యంగా కరూర్ వంటి ప్రాంతాలలో అక్రమ ఇసుక, ఖనిజ తవ్వకాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్లకు కఠిన ఆదేశాలు జారీ చేశామని కూడా అర్జున తెలిపారు. 100 ఏళ్ల నాటి పీడబ్ల్యూడీని రియల్-టైమ్ డాష్‌బోర్డ్‌లు, సాఫ్ట్‌వేర్‌ల ద్వారా ఆధునీకరించి, దానిని ప్రధాన ప్రైవేట్ మౌలిక సదుపాయాల దిగ్గజాలతో పోటీపడగల స్వయం సమృద్ధి, లాభదాయక సంస్థగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.