తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణికి భారీ షాక్ తగిలింది. ఐదుగురు రెబల్స్ మళ్లీ ఎడప్పాడి పళనిసామి గూటికి చేరకున్నారు. సీవీ షణ్ముగం, వేలుమణి నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు ఈపీఎస్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, బలపరీక్షలో విజయ్‌కు మద్దతుగా ఓటేశారు. దీంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు పళనిసామి వర్గం వినతిపత్రం సమర్పించింది. ఈపీఎస్‌ శిబిరంలో 22 మంది ఉండగా.. రెబల్స్‌లో ఐదుగురు వెనక్కి రావడంతో బలం 27కు చేరింది. ఆర్కాడు ఎమ్మెల్యే సుకుమార్‌ తొలుత ఈపీఎస్‌ను కలిసి ఆయన శిబిరంలో చేరారు. తర్వాత అందియూర్ ఎమ్మెల్యే హరిభాస్కర్‌, శంకరన్‌కోవిల్ ఎమ్మెల్యే దిలీపన్‌ జయశంకర్‌, కాంగేయం ఎమ్మెల్యే నటరాజన్‌, పన్రుట్టి ఎమ్మెల్యే మోహన్ కూడా ఈపీఎస్‌ గూటికి చేరకున్నారు. విజయ్ నాయకత్వంలోని అధికార టీవీకేకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలకు ఆశించిన మంత్రి పదవులు దక్కకపోవడంతోనే రాజకీయ భవిష్యత్తు కోసం మళ్లీ సొంతగూటికి వచ్చిన సమాచారం.రెబల్స్‌లో ముగ్గురు ఎమ్మెల్యేల తమ పదవులకు రాజీనామా చేసి, టీవీకేలో చేరారు. ఈ పరిణామాలతో ఈపీఎస్‌ వర్గం బలం 22 నుంచి 27కి చేరుకోగా.. రెబల్స్ బలం 17కి తగ్గింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకే ఉప-ఎన్నికల్లో విజయ్ టికెట్‌ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, తన వెంట ఉన్న ఐదుగురు ఈపీఎస్ శిబిరంలో చేరడంతో ఎస్పీ వేలుమణి షాకయ్యారు. దీంతో ఆయన ఎలా పావులు కదపుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను వేలుమణి వర్గం ఎమ్మెల్యేలు కేపీ అన్బళగన్, సి.విజయభాస్కర్‌ కలిశారు. తమ పార్టీ విప్‌గా వేలుమణిని ఆమోదించాలని విజ్ఞాపన పత్రం అందించినట్టు సమాచారం. కాగా, రాజీనామా లేఖను ఎమ్మెల్యే స్వహస్తాలతో రాసి ఇవ్వడం వల్లే తాను ఆమోదించానని స్పీకర్ పేర్కొనడం గమనార్హం.