ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. సస్పెన్స్‌ల మీద సస్పెన్స్‌ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మొత్తానికి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఎలమినేటర్ మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై నుంచి ముల్లాన్‌పూర్ చేరుకుంది. ముల్లాన్‌పూర్ చేరుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ల ఫొటోలు, వీడియోల కోసం ఎయిర్‌పోర్ట్‌లో పాపరాజీలు ఎగబడ్డారు. ఆ సమయంలో అందరి దృష్టిని ఆకట్టుకోగా.. కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముల్లాన్‌పూర్ ఎయిర్‌పోర్టుకు రాజస్థాన్ ప్లేయర్లు చేరుకున్న తర్వాత ఫొటోగ్రాఫర్లు ఆటగాళ్ల ఫొటోలు తీస్తున్నారు. ఈ సమయంలో ఒక ఫొటోగ్రాఫర్ రియాన్ పరాగ్‌తో "సర్.. వైభవ్‌తో ఒక ఫొటో దిగుతారా?" అని అడిగాడు. దాంతో రియాన్ పరాగ్ నవ్వుతూ.. "మేమేమైనా సినిమా స్టార్లమా?" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ ఆశ్చర్యపోయి ఓ చిన్న స్మైల్‌తో ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనాలు సృష్టిస్తున్నాడు. కేవలం 14 మ్యాచ్‌లలో 583 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ 5లో నిలిచాడు. దాంతో పాటు ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డుకు వైభవ్ సూర్యవంశీ ఆరు సిక్సర్ల దూరంలో మాత్రమే నిలిచాడు. సూర్యవంశీ ఇంకో ఏడు సిక్సర్లు కొడితే గిల్ రికార్డును బద్దలుకొట్టినట్లే. ఈ సీజన్‌లో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు చేసిన వైభవ్ సూర్యవంశీ.. టీ20ల్లో డబుల్ సెంచరీ చేయాలన్నది తన లక్ష్యమంటూ ఇటీవలే ప్రకటించాడు. సీజన్ ఆరంభానికి ముందు చెప్పినట్టే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ బాదాడు. జోష్ హేజిల్‌వుడ్, కగిసో రబడా, మిచెల్ స్టార్క్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ఉతికారేశాడు. రాజస్థాన్ రాయల్స్‌కు వైభవ్ సూర్యవంశీ కీలక ఆటగాడిగా ఉన్న ఈ సమయంలో సన్‌రైజర్స్‌తో జరగనున్న ఎలిమినేటర్‌లో ఎలా ఆడతాడో చూడాలి.